|
|
by Suryaa Desk | Sun, Mar 01, 2026, 07:50 PM
ఆమె ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఉన్నత చదువులు చదివి, ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్న ఆమె హాయిగా జీవిస్తోంది. పది రోజుల క్రితమే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి కూడా చేసుకుంది. ఇక జీవితమంతా సంతోషంగా ఉంటుందని అనుకుంటుండగా.. ఓ జ్యోతిష్యుడు చెప్పిన మాటలు ఆమెలో భయాన్ని నింపాయి. ‘నీకు అల్పాయుష్షు, పెళ్లయితే జరిగింది కానీ రెండేళ్లకు మించి నీవు అతడితో కాపురం చేయవు, విడాకులు తీసుకుంటావు’ అని ఆ జోతిష్యుడు చెప్పాడు. తొమ్మిది రోజుల పాటు పూజలు చేయాలని కూడా చెప్పాడు. ఈ మాటలకు విపరీతంగా భయపడిపోయిన ఆమె బలవన్మరణానికి పాల్పడింది.
అసలేం జరిగిందంటే..?
బెంగళూరులోని బాగలగుంటె పరిధిలోని ఎంఈఐ లే ఔట్‌కు చెందిన 29 ఏళ్ల విద్యాజ్యోతి ఒక ప్రైవేట్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. అయితే కొడగు ప్రాంతానికి చెందిన ఓ అబ్బాయితో ప్రేమలో ఉన్న ఆమె.. తొమ్మిది రోజుల కిందటే అతడిని పెళ్లి చేసుకుంది. ఇద్దరూ కలిసి తల్లిదండ్రులను ఒప్పించి మరీ ఒక్కటయ్యారు. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగ్గా.. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇక్కడి వరకూ అంతా సవ్యంగానే జరగ్గా.. తాజాగా ఆమె ఓ జ్యోతిష్యుడిని కలిసింది. అదే ఆమె పాలిట శాపంగా మారింది.
తాళి తీయమన్న జ్యోతిష్యుడు..
"నీకు అల్పాయుష్షు.. నువ్వు ఎక్కువ కాలం బతకవు. వివాహం జరిగింది కానీ రెండేళ్ల కంటే ఎక్కువగా అతడితో కలిసుండలేవు. విడాకులు తీసుకుంటారు" అని సదరు ఆస్ట్రాలజర్ ఆమెకు జోస్యం చెప్పాడు. దీంతో తీవ్రంగా భయపడిపోయిన విద్యా జ్యోతి దీనికి ఏమైనా పరిష్కారం చూపించమని కోరింది. దీంతో ఆ జ్యోతిష్యుడు తొమ్మిది రోజుల పాటు పూజలు చేయాలని సూచించాడు. చివరి రోజైన శుక్రవారం నాడు ధరించిన మంగళ సూత్రాన్ని తీసి అమ్మవారికి సమర్పించాలని చెప్పాడు. అలా చేస్తే ప్రాణగండం తప్పుతుందని నమ్మించాడు.
జ్యోతిష్యుడి మాటలను బలంగా నమ్మిన విద్యాజ్యోతి.. ఆయన చెప్పినట్లుగానే తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించింది. శుక్రవారం రాత్రి ఆఖరి పూజ ముగించుకుని.. తాళి తీసి అమ్మవారికి సమర్పించే సమయం రాగానే ఆమెలో ఏదో తెలియని అలజడి మొదలైంది. పూజ గది నుంచి తన గదిలోకి వెళ్లిన ఆమె.. లోపల తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఎంత సేపటికీ ఆమె బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా.. అప్పటికే ఆమె ప్రాణాలు విడిచింది.
సమాచారం అందుకున్న బాగలకుంటె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈక్రమంలోనే కుటుంబ సభ్యులను విచారించగా.. జ్యోతిష్యుడి గురించి చెప్పారు. దీంతో అతడు ఎవరు, విద్యాజ్యోతిని ఎందుకు ఇంతగా భయపెట్టాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Latest News