|
|
by Suryaa Desk | Sun, Mar 01, 2026, 07:56 PM
బ్రిటన్ దివంగత రాణి క్వీన్ ఎలిజబెత్ II చిన్నతనంలో తన చేతులతో రాసిన ఒక అరుదైన లేఖ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. దాదాపు ఎనిమిది దశాబ్దాల క్రితం నాటి ఈ లేఖ.. ఇటీవల జరిగిన ఒక వేలంలో ఏకంగా 25,000 పౌండ్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 30 లక్షలు) ధరకు అమ్ముడుపోయింది. కేవలం ఐదు వేల డాలర్లు పలుకుతుందని భావించిన ఈ లేఖ.. అంచనాలను మించి భారీ ధరను సొంతం చేసుకోవడం విశేషంగా నిలుస్తోంది.
బీబీసీ కథనం ప్రకారం.. ఈ లేఖను ఎలిజబెత్ తన 10 ఏళ్ల వయసులో అంటే 1936 నుంచి 1940 మధ్య కాలంలో రాశారు. అప్పట్లో విండ్సర్‌లోని రాయల్ లాడ్జ్‌లో హెడ్ హౌస్‌మెయిడ్‌గా పని చేసిన బీట్రిస్ స్టిల్‌మ్యాన్‌కు ఆమె ఈ ఉత్తరాన్ని రాశారు. ఈ లేఖలో రాణికి జంతువుల పట్ల ఉన్న అమితమైన ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా "పక్షులు బాగున్నాయని ఆశిస్తున్నాను.. గోల్డ్ ఫిష్‌లు చనిపోలేదని అనుకుంటున్నాను" అంటూ తన పెంపుడు జీవుల క్షేమ సమాచారాన్ని ఆమె ఆరా తీశారు. కేవలం మాటలే కాకుండా.. ఆ లేఖలో కుక్కలు, గుర్రాలు, పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న బొమ్మలను కూడా ఆమె ఆ లేఖలో గీశారు.
అంతటితో ఆగకుండా తాను కోసిన పువ్వులను ఇతర సిబ్బందితో పంచుకోవాలని కూడా ఆమె బీట్రిస్‌ను ఆ లేఖలో కోరడం గమనార్హం. ఒక్క ఆలోచన చూస్తుంటేనే ఆమెకు తమ దగ్గర పని చేసే వాళ్ల పట్ల ఎంతటి ప్రేమ, గౌరవం ఉన్నాయో అర్థం అవుతోంది. అయితే ఈ అరుదైన లేఖ వెలుగులోకి వచ్చిన తీరు కూడా సినిమా స్టోరీని తలపిస్తుంది. బీట్రిస్ స్టిల్‌మ్యాన్ 2024లో మరణించిన తర్వాత.. ఆమె మేనకోడలైన జీన్ వెస్టాకోట్ ఇంట్లోని వస్తువులను సర్దుతోంది. అప్పుడే ఆమె మంచం కింద ఒక పాత సూట్‌కేసు కనిపించగా దాన్ని తెరిచి చూసింది. ఇలా ఈ లేఖ బయటపడింది.
దీంతో ఆమె ఈ లేఖను తన సోదరుడికి చూపించింది. జీన్ మేనల్లుడు విలియం వెస్టాకోట్ దీనిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్య పోయారు. వేలం నిర్వహించిన 'హాన్సన్స్ ఆక్షనీర్స్' ప్రతినిధి జస్టిన్ మాథ్యూస్ మాట్లాడుతూ.. "ఈ లేఖ రాణిగారి చిన్ననాటి స్వభావాన్ని ప్రతిబింబిస్తోంది. ఆ కాలంలో రాజకుటుంబీకులు తమ సిబ్బందితో ఎంత ఆత్మీయంగా ఉండేవారో దీని ద్వారా అర్థం అవుతుంది" అని పేర్కొన్నారు.
ప్రిన్సెస్ మార్గరెట్ కొంటెతనం
ఈ లేఖలో ఎలిజబెత్ సోదరి, ప్రిన్సెస్ మార్గరెట్ కూడా ఒక చిన్న నోట్ రాశారు. "బీట్రిస్! ప్లీజ్ నా స్విమ్మింగ్ సూట్ జాగ్రత్తగా చూడు" అంటూ ఆమె రాసిన వాక్యాలు నవ్వులు పూయిస్తున్నాయి. ఎలిజబెత్ తన పెంపుడు జంతువుల గురించి ఆరా తీస్తే.. మార్గరెట్ తన దుస్తుల గురించి ఆందోళన చెందడం ఆ ఇద్దరు సోదరీమణుల విభిన్న మనస్తత్వాలను తెలియజేస్తోందని వేలం నిర్వాహకులు చమత్కరించారు. మొత్తానికి ఒక మారుమూల గ్రామంలోని మంచం కింద దొరికిన ఈ చిత్తు కాగితం.. నేడు బ్రిటన్ రాజకుటుంబ చరిత్రలో ఒక అమూల్యమైన పత్రంగా మిగిలిపోయింది.
Latest News