|
|
by Suryaa Desk | Sun, Mar 01, 2026, 08:02 PM
మూడు దశాబ్దాల పాటు ఒకే ఒక్కడి అదుపులో ఉన్న ఇరాన్ పాలనా పగ్గాలు ఇప్పుడు ఒక మండలి చేతికి మారాయి. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడిలో సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్లు ధృవీకరించిన కొద్ది గంటల్లోనే.. దేశంలో అధికార శూన్యత ఏర్పడకుండా ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ నిబంధనల మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన తాత్కాలిక కౌన్సిల్‌ను ఏర్పాటు చేసినట్లు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ ప్రకటించింది.
పాలనా పగ్గాలు చేపట్టిన ముగ్గురు నేతలు..
కొత్త సుప్రీం లీడర్ ఎన్నికయ్యే వరకు దేశ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఈ కౌన్సిల్ బాధ్యత వహిస్తుంది. ఇందులో ముగ్గురు కీలక వ్యక్తులు ఉంటారు. ముఖ్యంగా ఇరాన్ ప్రస్తుత అధ్యక్షుడిగా మసూద్ పెజెష్కియాన్ వ్యవహరించనుండగా.. న్యాయ వ్యవస్థ అధిపతి, గార్డియన్ కౌన్సిల్‌లో ఒక జ్యూరీ సభ్యుడు ఉన్నట్లు ఐఆర్ఎన్ఏ వెల్లడించింది. అయితే ఈ ముగ్గురు సభ్యుల బృందం సంయుక్తంగా నిర్ణయాలు తీసుకుంటూ.. యుద్ధ ప్రాతిపదికన దేశాన్ని ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేయనుంది.
ఏమిటీ గార్డియన్ కౌన్సిల్?
ఇరాన్ అధికార కేంద్రంలో అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ లేదా గార్డియన్ కౌన్సిల్ అత్యంత శక్తిమంతమైనది. ఇందులో 88 మంది సభ్యులు ఉంటారు. వీరంతా ఎనిమిదేళ్ల పదవీకాలం కోసం ఎన్నికైన షియా మతగురువులు. అయితే ఇరాన్ సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే లేదా తొలగించే పరమాధికారం ఈ గ్రూపునకు మాత్రమే ఉంది. దేశ చట్టాలు రాజ్యాంగానికి, ఇస్లామిక్ విలువలకు అనుగుణంగా ఉన్నాయో లేదో ఈ విభాగమే పర్యవేక్షిస్తుంది. ఇప్పుడు ఖమేనీ వారసుడిని వెతికే బృహత్తర బాధ్యత కూడా వీరిపైనే ఉంది.
నేలకూలిన అగ్రశ్రేణి నాయకత్వం
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల.. కేవలం ఖమేనీ మాత్రమే కాదు ఇరాన్ రక్షణ వ్యవస్థలోని దిగ్గజాలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ అత్యున్నత సైనిక దళమైన ఐఆర్‌జీసీ (ఐఆర్‌సీసీ) కమాండర్ మహమూద్ పాక్‌పూర్, ఖమేనీకి కుడిభుజం లాంటి కీలక సలహాదారు అలీ షామ్‌ఖానీ కూడా మరణించినట్లు ఐఆర్ఎన్ఏ ధృవీకరించింది. అలాగే ఖమేనీ కుమారుడు, అల్లుడు, మనవరాలు కూడా ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 30 మంది దిగ్గజాలు ఈ దాడుల్లో మరణించారు.
Latest News