ప్రధాని మోదీ పవన్ కల్యాణ్‌తో కలిసి మహిళల అభ్యున్నతికి కృషి చేస్తామని చంద్రబాబుప్రకటన
 

by Suryaa Desk | Sun, Mar 08, 2026, 07:19 PM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతిలోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. సభకు భారీగా తరలివచ్చిన మహిళలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తాను, ప్రధాని నరేంద్ర మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముగ్గురం కలిసి మహిళల అభ్యున్నతికి, వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. సృష్టికి మూలం మహిళ అని, ప్రేమ, త్యాగం, కష్టానికి వారు ప్రతిరూపమని కొనియాడారు. తెలుగింటి ఆడబిడ్డలకు, దేశంలోని మహిళలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.సీఎంగానే కాకుండా ఒక అన్నగా, తండ్రిగా ఆడబిడ్డలను ప్రోత్సహించి ఉన్నత స్థానాలకు తీసుకురావడానికి తన సర్వశక్తులూ ఒడ్డుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. 2019-24 మధ్య కాలంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, దానివల్ల తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తాను, మోదీ, పవన్ కల్యాణ్ కలిసి పేదలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, డ్వాక్రా, మెప్మా సంఘాలకు పూర్వ వైభవం తీసుకురావడమే తమ ఆలోచన అని పునరుద్ఘాటించారు. మహిళలకు న్యాయం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన అన్నారు.మా ఆడబిడ్డలు తయారుచేసే వస్తువులకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో 'స్వయం' బ్రాండ్‌ను ప్రారంభించాం. ఈ బ్రాండ్‌కు నేనే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటాను. నాణ్యత, ప్యాకేజింగ్, టెక్నాలజీ వంటి అంశాల్లో ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 84 లక్షల మందికి పైగా డ్వాక్రా సభ్యులున్నారు. వారందరినీ ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే మా సంకల్పం" అని వివరించారు.ఇప్పటికే లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారని, రాబోయే ఏడాదిలో మరో 5 లక్షల మందిని చేర్చి మొత్తం 6 లక్షల మందితో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు. మహిళలు తయారు చేసే వస్తువులను వారే వినియోగించుకుంటే దాదాపు మూడున్నర కోట్ల మంది వినియోగదారులు ఏర్పడతారని, ఇది మార్కెటింగ్‌కు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.ఈ సందర్భంగా ఆయన పలువురు మహిళా ప్రముఖులను ప్రశంసించారు. దేశానికి రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సమర్థవంతంగా పనిచేస్తున్నారని అన్నారు. వచ్చిన ఆదాయాన్ని సమర్థంగా వినియోగించి కుటుంబాన్ని నడిపే మహిళలే నిజమైన ఆర్థిక మంత్రులని చంద్రబాబు అభివర్ణించారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కూడా ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళ రాబోతున్నారని తెలపడం సంతోషంగా ఉందన్నారు.దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను గుర్తుచేసుకుంటూ, ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి చట్టం చేసిన ఘనత ఆయనదేనని చంద్రబాబు అన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది, మహిళల కోసం ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది కూడా ఎన్టీఆరే అని గుర్తుచేశారు. తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు, కళాశాలల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించానని, ఆ నిర్ణయం వల్లే నేడు ఐటీ వంటి రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారని వివరించారు. భవిష్యత్తులో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు రాబోతున్నాయని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని రాజకీయాల్లోకి రావడానికి మహిళలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.మహిళల భద్రత విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏమాత్రం రాజీపడదని చంద్రబాబు తేల్చిచెప్పారు. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే, అదే వారికి చివరి రోజు అవుతుంది. అలాంటి దుర్మార్గులను కఠినంగా హెచ్చరిస్తున్నా. మీ భద్రతకు చంద్రన్న ఉన్నంతవరకు భయపడాల్సిన అవసరం లేదు అని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్ర హోంమంత్రిగా కూడా ఒక మహిళే  ఉన్నారని, ఎక్కడ సమస్య ఎదురైనా తక్షణమే స్పందిస్తారని గుర్తుచేశారు.ఇదే సమయంలో, రాష్ట్రంలో జనాభా తగ్గుదలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. "ఒకప్పుడు 'ఒక బిడ్డ ముద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు వద్దు' అన్నాను. కానీ ఇప్పుడు 'ఒక బిడ్డ వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు' అని చెబుతున్నాను. రాష్ట్రంలో జననాల రేటు 1.5కి పడిపోయింది. ఇది ప్రమాదకరం. అందుకే పెద్ద కుటుంబాలను ప్రోత్సహించేందుకు అవసరమైతే మూడు పడకగదుల ఇల్లు, అదనపు రేషన్ వంటి ప్రోత్సాహకాలు అందిస్తాం" అని నూతన విధానాన్ని ప్రకటించారు.

Latest News
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM
Two British nationals confirmed as hantavirus-infected Fri, May 08, 2026, 04:42 PM
Bengal to witness inclusive development under PM Modi, move towards 'Sonar Bangla': Delhi BJP chief Fri, May 08, 2026, 04:41 PM
Indian construction equipment industry's exports surge 31.5 pc in FY26 Fri, May 08, 2026, 04:25 PM
Hantavirus unlikely to reach pandemic scale, no cases in India so far: Report Fri, May 08, 2026, 04:24 PM