|
|
by Suryaa Desk | Fri, Apr 03, 2026, 09:53 PM
ఐపీఎల్ 2026 సీజన్‌లో సీఎస్‌కే వర్సెస్ పంజాబ్ మధ్య ఏడో మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతోంది. చెన్నై హోం గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుని సీఎస్‌కేను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ క్రీజులోకి వచ్చారు. అయితే గత మ్యాచ్‌లాగే ఈసారి కూడా సంజూ శాంసన్ నిరాశపరిచాడు. కేవలం 7 పరుగులు మాత్రమే చేసి బార్టన్ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.ఆ తర్వాత వన్‌డౌన్‌గా వచ్చిన యువ ఆటగాడు ఆయుష్ మాత్రే దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. మైదానం నలువైపులా షాట్లు ఆడుతూ బౌలర్లపై ఒత్తిడి తీసుకొచ్చాడు. కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 43 బంతుల్లో 73 పరుగులు చేసి వైశాఖ్ బౌలింగ్‌లో యజువేంద్ర చాహల్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.మాత్రే ఔటైన వెంటనే చాహల్ మరో దెబ్బకొట్టి సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (28) వికెట్‌ను కూడా దక్కించుకున్నాడు. అప్పటివరకు నెమ్మదిగా ఆడుతున్న రుతురాజ్, నేహల్ వధేరాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో సీఎస్‌కే 123 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయింది.తర్వాత క్రీజులోకి వచ్చిన కార్తీక్ శర్మ ఎక్కువసేపు నిలవలేక 1 పరుగుకే మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. అనంతరం వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ తక్కువ బంతుల్లోనే వేగంగా పరుగులు సాధిస్తూ 12 బంతుల్లో 32 పరుగులు చేశాడు.చివరి దశలో శివమ్ దూబే దూకుడుగా ఆడగా, ప్రశాంత్ వీర్ అతనికి చక్కటి సహకారం అందించాడు. చివరి ఓవర్లో సీఎస్‌కే 12 పరుగులు సాధించగా, దూబే వ్యక్తిగతంగా 45 పరుగులు చేసి జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించాడు.దీంతో సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో 209 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో వైశాఖ్ 2 వికెట్లు తీసుకోగా, జాన్సెన్, బార్టన్, చాహల్ తలో వికెట్ సాధించారు. పంజాబ్ కింగ్స్ ముందుకు 210 పరుగుల లక్ష్యాన్ని సీఎస్‌కే నిర్దేశించింది.
Latest News