|
|
by Suryaa Desk | Thu, Apr 16, 2026, 12:00 AM
ఈ ఏడాది మార్చితో ముగిసిన 2025–26 ఆర్థిక సంవత్సరంలో అమెరికాను అధిగమించి చైనా భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది.ఈ కాలంలో భారత్–చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 151.1 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.14.09 లక్షల కోట్లకు) చేరింది. అదే సమయంలో చైనాతో భారత్ వాణిజ్య లోటు 112.16 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.గత 2024–25 ఆర్థిక సంవత్సరం వరకు వరుసగా నాలుగేళ్ల పాటు అమెరికానే భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగింది. అయితే తాజా గణాంకాల ప్రకారం ఈ స్థానం ఇప్పుడు చైనా దక్కించుకుంది.గత ఏడాదిలో చైనాకు భారత్ ఎగుమతులు 36.66 శాతం పెరిగి 19.47 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.1.81 లక్షల కోట్లకు) చేరాయి. అదే సమయంలో దిగుమతులు 16 శాతం పెరిగి 131.63 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.12.27 లక్షల కోట్లకు) చేరినట్లు సమాచారం.దీంతో 2024–25లో 99.2 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు, 2025–26లో చారిత్రాత్మక గరిష్ఠమైన 112.6 బిలియన్ డాలర్లకు పెరిగింది.మరోవైపు అమెరికాతో వాణిజ్యంలో భారత ఎగుమతులు 0.92 శాతం పెరిగి 87.3 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు 15.95 శాతం పెరిగి 52.9 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో అమెరికాతో వాణిజ్య లోటు 40.89 బిలియన్ డాలర్ల నుంచి 34.4 బిలియన్ డాలర్లకు తగ్గినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Latest News