|
|
by Suryaa Desk | Sun, Apr 26, 2026, 11:25 PM
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. అంగ్‌క్రిష్ రఘువంశీ ‘అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ (ఫీల్డింగ్‌కు అడ్డంకి కలిగించడం) కారణంగా ఔట్ కావడం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఐపీఎల్ చరిత్రలో ఈ విధంగా ఔట్ అయిన నాలుగో ఆటగాడిగా ఆయన నిలిచాడు.అసలేం జరిగిందంటే..కోల్‌కతా ఇన్నింగ్స్ 5వ ఓవర్‌ను ప్రిన్స్ యాదవ్ వేస్తున్నాడు. ఆ ఓవర్ చివరి బంతిని రఘువంశీ మిడ్ ఆన్ వైపు ఆడి సింగిల్ కోసం ప్రయత్నించాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న మహమ్మద్ షమీ బంతిని వేగంగా అందుకుని స్ట్రైకర్ ఎండ్ వైపు విసిరాడు. ఈ సమయంలో రఘువంశీ సగం దూరం వరకు పరుగెత్తి తిరిగి క్రీజ్ వైపు మళ్లాడు. వెనక్కి వస్తున్న క్రమంలో షమీ విసిరిన బంతి అతని కాలికి తగిలింది. దాంతో బంతి వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు సరిగా చేరలేదు.ఈ ఘటనపై రిషభ్ పంత్ ఫీల్డ్ అంపైర్‌కు ‘అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ కింద అప్పీల్ చేశాడు. అంపైర్ విషయాన్ని థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేయగా, రిప్లేలను పరిశీలించిన తర్వాత రఘువంశీ ఉద్దేశపూర్వకంగానే ఫీల్డింగ్‌కు అడ్డుపడ్డాడని నిర్ధారించారు. ఆర్టికల్ 37 ప్రకారం అతడిని ఔట్‌గా ప్రకటించారు.ఈ నిర్ణయంపై రఘువంశీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మైదానాన్ని విడిచాడు. అసహనంతో బ్యాట్, హెల్మెట్‌ను నేలకేసి కొట్టడం కూడా కనిపించింది.కోల్‌కతా నైట్ రైడర్స్ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్, మెంటార్ షేన్ వాట్సన్ ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.నెటిజన్లలో ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రఘువంశీకి మద్దతు తెలుపుతుండగా, మరికొందరు అతను ఉద్దేశపూర్వకంగానే అడ్డుపడ్డాడని అంటున్నారు. గతంలో యూసుఫ్ పఠాన్, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు కూడా ఇదే రూల్ కింద ఔట్ అయిన సంగతి తెలిసిందే.
Latest News