|
|
by Suryaa Desk | Sun, Apr 26, 2026, 11:34 PM
భానుడి భగభగలతో ఎండలు తీవ్రంగా మారుతున్నాయి. ఈ వేడికి ఉపశమనం పొందేందుకు ఇళ్లలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం భారీగా పెరిగింది. అయితే వీటి వాడకం పెరిగిన కొద్దీ నెలాఖరున వచ్చే విద్యుత్ బిల్లు కూడా సామాన్యులపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతోంది.చాలా సందర్భాల్లో మనం వాడిన దానికంటే ఎక్కువ బిల్లు రావడం లేదా మీటర్ రీడింగ్‌లో పొరపాట్లు జరగడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆందోళన చెందకుండా, వినియోగదారులుగా మన హక్కులను ఎలా ఉపయోగించుకోవాలో, అలాగే బిల్లును ఎలా నియంత్రించుకోవాలో తెలుసుకోవడం అవసరం.అధిక విద్యుత్ బిల్లు రావడానికి కేవలం వినియోగం పెరగడమే కాకుండా కొన్ని సాంకేతిక కారణాలు కూడా ఉంటాయి. మీటర్ లోపాలు, రీడింగ్ నమోదు సమయంలో జరిగే పొరపాట్లు, అలాగే గత నెల బకాయిలు అప్‌డేట్ కాకుండా ప్రస్తుత బిల్లులో కలిసిపోవడం వంటివి దీనికి కారణమవుతాయి.ఇలాంటి సమస్యలు ఎదురైతే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, దేశవ్యాప్తంగా వినియోగదారుల కోసం 1912 అనే హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి ఈ నంబర్‌కు కాల్ చేసి మీ కస్టమర్ ఐడి లేదా RR నంబర్ చెప్పితే ఫిర్యాదు నమోదు అవుతుంది. ఈ సేవ 24 గంటలు పనిచేస్తుంది.అంతేకాకుండా వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. 8800001915 నంబర్‌ను సేవ్ చేసుకుని “Hi” అని మెసేజ్ పంపితే అందులో వచ్చే సూచనల ప్రకారం భాషను ఎంచుకుని సమస్యను నమోదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన తర్వాత వినియోగదారులకు రిఫరెన్స్ నంబర్ ఇవ్వబడుతుంది, దాని ద్వారా సమస్య పురోగతిని ట్రాక్ చేయవచ్చు. సాధారణంగా 3 నుంచి 7 రోజుల్లో అధికారులు ఇంటికి వచ్చి మీటర్ తనిఖీ చేస్తారు.ఫిర్యాదుతో పాటు కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కూడా విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. పాత బల్బుల స్థానంలో LED బల్బులు వాడటం ద్వారా భారీగా విద్యుత్ ఆదా చేయవచ్చు. అలాగే ఏసీ, ఫ్రిజ్ వంటి పరికరాలను కొనుగోలు చేసేప్పుడు 5-స్టార్ రేటింగ్ ఉన్నవాటిని ఎంచుకోవడం మంచిది. ఏసీ ఉష్ణోగ్రతను 24°C నుంచి 26°C మధ్య ఉంచడం ద్వారా వినియోగం తగ్గుతుంది. అదేవిధంగా ఉపయోగంలో లేని సమయంలో ఛార్జర్లు, టీవీలు వంటి పరికరాలను పూర్తిగా ఆఫ్ చేయడం ద్వారా అదనపు విద్యుత్ ఖర్చును నివారించవచ్చు.సరైన అవగాహనతో పాటు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే విద్యుత్ బిల్లును నియంత్రించుకోవడంతో పాటు అనవసర ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చు.
Latest News