|
|
by Suryaa Desk | Thu, Apr 30, 2026, 09:08 PM
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్ త్వరలోనే స్పష్టమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్ పర్యటనలో అతడి ప్రదర్శన ఆధారంగానే కెప్టెన్‌గా కొనసాగించాలా లేదా అన్న విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తుది నిర్ణయం తీసుకోనుందని సమాచారం.ఇటీవల భారత్‌కు టీ20 వరల్డ్‌కప్ టైటిల్ అందించిన సూర్యకుమార్, కెప్టెన్‌గా విజయవంతమైనప్పటికీ బ్యాటర్‌గా మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. మరోవైపు, 2028లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌తో పాటు లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టును ముందుగానే సిద్ధం చేయాలనే ఆలోచనలో మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో 35 ఏళ్ల సూర్యకు విశ్రాంతి ఇచ్చి, యువ కెప్టెన్ సారథ్యంలో కొత్త జట్టును నిర్మించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అతడి స్థానానికి ప్రత్యామ్నాయంగా శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ పేర్లు చర్చలోకి వచ్చాయి.అయితే గిల్ ఇటీవలి కాలంలో అంతర్జాతీయ టీ20ల్లో స్థిరమైన ప్రదర్శన చేయలేకపోవడంతో అతడిని తిరిగి కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. వన్డే, టెస్టు జట్ల కెప్టెన్‌గా ఉన్నప్పటికీ టీ20 ఫార్మాట్‌లో సెలక్టర్లు అతడిపై నమ్మకం చూపకపోవచ్చని భావిస్తున్నారు.మరోవైపు, రోహిత్ శర్మ తర్వాత టీ20 కెప్టెన్సీ హార్దిక్ పాండ్యాకు దక్కుతుందని భావించినప్పటికీ, బీసీసీఐ అనూహ్యంగా సూర్యకుమార్‌కు బాధ్యతలు అప్పగించింది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌పై అధిక ఒత్తిడి పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో వెల్లడించారు.సంజూ శాంసన్, అక్షర్ పటేల్‌లకు కెప్టెన్సీ అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇక శ్రేయస్ అయ్యర్ 2023 డిసెంబర్ తర్వాత ఇప్పటి వరకు టీ20 జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. అయితే దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అతడు చూపుతున్న ప్రదర్శన మాత్రం అతడికి అనుకూలంగా ఉంది.ఈ క్రమంలో సూర్య స్థానాన్ని శ్రేయస్ అయ్యర్ భర్తీ చేస్తాడనే వార్తలు వినిపించినప్పటికీ, తాజా నివేదికలు మాత్రం భిన్నంగా చెబుతున్నాయి. మెజారిటీ మాజీ క్రికెటర్లు శ్రేయస్‌కు మద్దతు ఇస్తున్నా, సెలక్టర్లు మాత్రం అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. జాతీయ టీ20 జట్టులో స్థానం పక్కాగా లేని ఆటగాడిని కెప్టెన్ చేయడానికి వారు ముందుకు రావడం లేదని సమాచారం.ఇదిలా ఉండగా, అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఇషాన్ కిషన్ పేరు ముందుకు వచ్చింది. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, సంజూ శాంసన్ కంటే టీ20 కెప్టెన్సీ రేసులో ప్రస్తుతం ఇషాన్ ముందంజలో ఉన్నాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నట్లు కథనాలు సూచిస్తున్నాయి.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో జార్ఖండ్ కెప్టెన్‌గా జట్టుకు తొలి టైటిల్ అందించిన ఇషాన్, తన నాయకత్వ ప్రతిభను నిరూపించాడు. అనంతరం టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చి, వరల్డ్‌కప్ 2026లో కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు.అదేవిధంగా ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆరంభ మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించి మంచి ప్రశంసలు అందుకున్నాడు. దీంతో భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఇషాన్ కిషన్ చుట్టూ యువ జట్టును నిర్మించాలనే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Latest News