|
|
by Suryaa Desk | Thu, Apr 30, 2026, 09:13 PM
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్ త్వరలోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఇంగ్లండ్ పర్యటనలో అతడి ప్రదర్శనను ఆధారంగా తీసుకుని, అతడిని కెప్టెన్‌గా కొనసాగించాలా లేదా అన్న దానిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తుది నిర్ణయం తీసుకోనుందని సమాచారం.ఇటీవల టీ20 వరల్డ్‌కప్ టైటిల్‌ను భారత్‌కు అందించిన సూర్య, కెప్టెన్‌గా విజయవంతమైనప్పటికీ బ్యాటర్‌గా మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. మరోవైపు, 2028 టీ20 వరల్డ్‌కప్‌తో పాటు లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టును ముందుగానే సిద్ధం చేయాలనే ఆలోచనలో మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో 35 ఏళ్ల సూర్యకు విశ్రాంతి ఇచ్చి, యువ కెప్టెన్ సారథ్యంలో కొత్త జట్టును నిర్మించాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. అతడి స్థానానికి ప్రత్యామ్నాయంగా శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ పేర్లు చర్చలోకి వచ్చాయి.అయితే గిల్ ఇటీవలి కాలంలో టీ20ల్లో నిరాశపరిచే ప్రదర్శన చేయడంతో, అతడికి వెంటనే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. వన్డే, టెస్టు జట్ల కెప్టెన్ అయినప్పటికీ టీ20 ఫార్మాట్‌లో అతడిపై సెలక్టర్లు నమ్మకం చూపకపోవచ్చని అంచనా.మరోవైపు, రోహిత్ శర్మ తర్వాత టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యానే బాధ్యతలు చేపడతాడని భావించినప్పటికీ, బీసీసీఐ అనూహ్యంగా సూర్యకుమార్‌ను ఎంపిక చేసింది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన హార్దిక్‌పై అధిక ఒత్తిడి పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో వెల్లడించారు.సంజూ శాంసన్, అక్షర్ పటేల్‌లకు కెప్టెన్సీ అవకాశాలు చాలా పరిమితంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక శ్రేయస్ అయ్యర్ 2023 డిసెంబర్ తర్వాత ఇప్పటివరకు టీ20 జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. అయితే దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో అతడు కెప్టెన్‌గా, బ్యాటర్‌గా చూపుతున్న ప్రదర్శన మాత్రం అతడికి ప్లస్ పాయింట్‌గా మారింది.ఈ క్రమంలో సూర్య స్థానాన్ని శ్రేయస్ అయ్యర్ భర్తీ చేస్తాడనే వార్తలు వినిపించినప్పటికీ, తాజా కథనాలు మాత్రం భిన్నంగా చెబుతున్నాయి. ఎక్కువ మంది మాజీ క్రికెటర్లు శ్రేయస్‌కు మద్దతు ఇస్తున్నా, సెలక్టర్లు మాత్రం అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం.అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ, ఇప్పుడు ఇషాన్ కిషన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, సంజూ శాంసన్ కంటే టీ20 కెప్టెన్సీ రేసులో ప్రస్తుతం ఇషాన్ ముందంజలో ఉన్నాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో జార్ఖండ్ కెప్టెన్‌గా జట్టుకు తొలి టైటిల్ అందించిన ఇషాన్, తన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించాడు. అనంతరం టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చి, వరల్డ్‌కప్ 2026లో కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు.అదేవిధంగా ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆరంభ మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఇషాన్ కిషన్ చుట్టూ యువ జట్టును నిర్మించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Latest News