ప్రస్తుతం హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్న సర్వే.. అగ్గిరాజేస్తోంది. ఈ క్రమంలోనే.. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజల్లో నెలకొన్న ఆందోళనలకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరణ ఇచ్చారు. మూసీకి ఇరువైపులా జరుగుతున్న సర్వేలకు.. హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను.. హైడ్రా అధికారులు తరలించడం లేదని రంగనాథ్ స్పష్టం చేశారు.
అంతేకాకుండా.. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇండ్లపై హైడ్రా ఎలాంటి మార్కింగ్ చేయట్లేదని రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. మూసీ సుందరీకరణ అనేది ప్రత్యేక ప్రాజెక్టు అని.. ఈ ప్రాజెక్టును మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపడుతోందని స్పష్టం చేసారు. ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం.. మూసీ పరివాహక ప్రాంతాన్ని అందంగా మార్చడంతో పాటు.. పర్యావరణాన్ని రక్షిస్తూ దాని ప్రయోజనాలను ప్రజలకు అందిచటమేనని వివరించారు రంగనాథ్.
అంతేకాకుండా.. రాష్ట్రంలో జరుగుతున్న కూల్చివేతలన్నీ హైడ్రాకు ముడిపెట్టొద్దని రంగనాథ్ సూచించారు. సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని స్పష్టం చేశారు. ఆ కూల్చివేతలకు హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సంగారెడ్డిలో హోంగార్డు గాయపడి చనిపోతే.. హైడ్రా బలి తీసుకుందనడం సరికాదని రంగనాథ్ చెప్పుకొచ్చారు.
హైడ్రా లక్ష్యం కూల్చివేతలు కాదని చెరువుల పునరుద్ధరణ అని రంగనాథ్ తెలిపారు. హైడ్రా అనేది పేద లేదా మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చివేయదని రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. హైడ్రా పరిధి కేవలం ఔటర్ రింగ్ రోడ్డు వరకు మాత్రమే విస్తరించి ఉందని తెలిపారు. నగరంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా, ఇతర రాష్ట్రాల్లో కూడా కూల్చివేతలను సోషల్ మీడియాలో హైడ్రాకు ఆపాదించి ప్రజల్లో అనవసర భయాన్ని కలిగిస్తున్నారని రంగనాథ్ అసహనం వ్యక్తం చేశారు. హైడ్రా సహజ వనరులను రక్షించడం, సరస్సులు, చెరువులు, డ్రైనేజీ మార్గాలను సంరక్షించడంతో పాటు వర్షాలు, వరదల సమయంలో రోడ్లు, నివాస ప్రాంతాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవడంపై దృష్టి సారిస్తుందని తెలిపారు.
అయితే.. హైడ్రా మీద వస్తున్న జరుగుతున్న ప్రచారంతో.. ప్రజలను అభద్రతాభావానికి గురిచేస్తున్నాయని రంగనాథ్ తెలిపారు. ప్రజలు భద్రత కోసం కృషి చేయాలని.. వార్తలు ప్రచారం చేసే ముందు వాటిని మరింత నిశ్చితంగా గమనించి.. సహాయకరంగా ఉండేలా చూడాలని కమిషనర్ కోరారు. ప్రజలు అవాస్తవాలను నమ్మొద్దని.. వాస్తవాలు తెలుసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa