పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు కోసం కృష్ణా నదిలో జల విహారం అందుబాటులోకి వచ్చింది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణాన్ని తెలంగాణ పర్యాటక శాఖ ప్రారంభించింది. 120 కిలోమీటర్లు, 6 గంటల్లో లాంచీ ప్రయాణం సాగనుండగా.. నాగార్జున కొండ, నందికొండ, సలేశ్వరం నల్లమల అటవీ అందాల మధ్య సాగే అద్భుత ప్రయాణం పర్యాటకులను కనువిందు చేస్తోంది. ప్రకృతి అందాలు చూసి పర్యాటకులు మైమర్చిపోతున్నారు. ప్రస్తుత వర్షాకాల సీజన్లో విస్తృతస్థాయిలో వర్షాలు కురవటం, కృష్ణానదిలో గరిష్ట మట్టంలో నీటి లభ్యత ఉండటంతో లాంచీ ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.