ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఒక్క పనితో రాహుల్ గాంధీ చరిత్ర పుటల్లో నిలుస్తారు.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 05, 2024, 11:27 PM

తెలంగాణలో కులగణన చేపట్టేందుకు కారణం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రే అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారమే తెలంగాణలో కులగణన చేపడతున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్రలో అన్ని వర్గాల వారిని రాహుల్ గాంధీ కలిశారని.. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారని.. ఆ సమస్యలకు పరిష్కార దిశగా పని చేస్తామని పేదలకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేపడతామని రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు.. ఈరోజు సర్వే చేపడుతున్నామని స్పష్టం చేశారు.


హైదరాబాద్ గాంధీ ఐడియాలజీ సెంటర్ వద్ద మేధావులు, ప్రజా సంఘాల నేతలతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. తెలంగాణలో చేపట్టబోతున్న కులగణన గురించి సమావేశంలో రాహుల్ చర్చించారు. ఆ సమావేశం అనంతరం.. నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ తదితరులు ప్రసంగించారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మాజీ ప్రధాని, దివంగత నేత ఇందిరా గాంధీ మాదిరిగానే రాహుల్ గాంధీ కూడా చరిత్ర పుటలో నిలుస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలో పేదలు ఉండొద్దనే ఉద్దేశంతో 'గరీబీ హఠావో' అని ఇందిరా గాంధీ పిలుపిచ్చారని.. ఇప్పుడు అదే సిద్ధాంతంతో రాహుల్ గాంధీ 'కులగణన'కు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ తర్వాత ఈ కులగణన కార్యక్రమంతో రాహుల్ గాంధీ చరిత్ర పుటల్లో నిలువనున్నారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.


సమాజంలో ఉంటున్న అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని.. ప్రజలందరికీ సామాజిక న్యాయం చేయాలని రాహుల్ గాంధీ ఈ కులగణనను సంకల్పించారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కులగణనపై ముందుకు నడిచారన్నారు. ఈ క్రమంలోనే.. కులగణనకు కోర్టు చిక్కులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కులగణన చేపట్టింది.. మరి మిగతా రాష్ట్రాల్లో పరిస్థితేంటని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అందరూ నిలదీయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.


సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి కులగణన సర్వేను కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా భావించిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. పౌర సమాజం నుంచి సూచనలు తీసుకోవడానికి రాహుల్ గాంధీ తెలంగాణకు రావడం గొప్ప విషయమన్నారు. ఈ నిర్ణయం తీసుకోవాలంటే గుండె ధైర్యం కావాలని కొనియాడారు. సామాజిక బాధ్యత, సమాన అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతోనే రాహుల్ గాంధీ సమావేశానికి వచ్చారని వివరించారు. మాటలతో కాదు, చేతలతో చూపాలన్నది రాహుల్ గాంధీ ఆలోచన అని వివరించారు.


విద్య, వైద్యం, ఉద్యోగం, సామాజిక న్యాయం ప్రజలకు అందించాలని రాహుల్ గాంధీ అడుగు ముందుకు వేశారని రేవంత్ రెడ్డి వివరించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చడమే తమ కర్తవ్యమని తెలిపారు. ఇటీవల తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-1 కోసం నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో.. 31,383 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారని.. అందులో ఓసీ అభ్యర్థులు 3076 మంది ఉండగా.. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 2774 మంది, ఓబీసీలు 17,921 ఉన్నారని.. ఇక ఎస్సీలు 4828, ఎస్టీలు 2783 ఉన్నట్టు రేవంత్ రెడ్డి వివరించారు. కులగణన పూర్తి చేసి బీసీలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కులగణనను 2025 జనగణనలో పరిగణనలోకి తీసుకోవాలని ఈ వేదికపై తీర్మానం చేస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa