సాధారణంగా.. అబ్బాయిలు అమ్మాయిల్లా మారిన సందర్భాలు చూస్తుంటాం. చాలా మంది ట్రాన్స్ జెండర్లు అలా మారినవాళ్లే. అబ్బాయిలుగా పుట్టినా.. పెరుగుతున్నా కొద్ది అమ్మాయిల లక్షణాలు బయటపడుతుంటంతో.. లింగ మార్పిడితో పూర్తిగా అమ్మాయిలుగా మారిపోతుంటారు. ఇలాంటి ఘటనలు కోకొల్లలు. అలా ట్రాన్స్ జెండర్లుగా మారిన వాళ్లలో చాలా మంది ఇప్పుడు పలు రంగాల్లో రాణిస్తున్నారు కూడా. అయితే.. ఇప్పుడు ఓ అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. రోటీన్‌కు భిన్నంగా అమ్మాయే అబ్బాయిగా మారిన ఘటన ఇది. అది కూడా 27 ఏళ్ల తర్వాత అసలు ముచ్చట బయటపడింది. ఈ ఘటన ఎక్కడో కాదు మన తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో జరిగింది.
దుబ్బాక మండలం రామక్కపేటకు చెందిన దొంతగౌని రమేశ్, మంజుల దంపతులకు మొదటి సంతానంగా 1996 అక్టోబర్ 30న ఓ అమ్మాయి జన్మించింది. సాక్షాత్తు మహాలక్ష్మే తమకు కూతురిగా పుట్టిందని ఎంతో మురిసిపోయారు. కావ్యశ్రీ అనే నామకరణం చేసి.. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. స్కూల్‌కు, కాలేజీకి పంపించి చదివించారు. అక్కడి వరకు అంతా సాధారణంగానే సాగింది. సరిగ్గా.. 2018 సంవత్సరం నుంచి కావ్యశ్రీ శరీరంలో మార్పులు రావటం మొదలైంది. యుక్తవయసులోకి ఎంటరైన కావ్యశ్రీకి అబ్బాయిల్లాగానే గడ్డం, మీసాలు పెరగటం ప్రారంభమైంది. చాలా మందికి ఇలా వస్తుంటాయని సర్ధి చెప్పుకుని.. పెద్దగా పట్టించుకోలేదు. కట్ చేస్తే.. 26 ఏళ్ల వయసులో కావ్యశ్రీకి విపరీతమైన కడుపు నొప్పితో పాటు పలు ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చాయి. ఆందోళన చెందిన తల్లిదండ్రుల పలు వైద్యులను సంప్రదించారు.
అయితే.. 2 నెలల క్రితం హైదరాబాద్‌లో వైద్యులను కలిశారు. ప్రత్యేక వైద్య నిపుణులను కలవాలని సూచించటంతో బెంగళూరుకు చెందిన డాక్టర్లను సంప్రదించారు. అక్కడి వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో నమ్మలేని నిజాలు బయట పడ్డాయి. కావ్యశ్రీకి పొత్తికడుపు భాగంలో పురుషుల మాదిరిగానే వృషణాలు ముడుచుకుని ఉండటమే కాకుండా.. రెండున్నర ఇంచుల అంగం ఉండటాన్ని గమనించారు. ముడుచుకున్న వృషణాలను ఆపరేషన్ చేసి సరి చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఛాతీ భాగం కూడా అబ్బాయిదేనని, అధిక కొవ్వు కారణంగా ఎత్తుగా కనపడిందని వైద్యులు వివరించారు. ఇలా ఛాతీ ఎత్తుగా పెరగడాన్ని గైనాకో మాస్టియో అంటారని వైద్యులు వివరించారు.
ఈ పరిణామంతో.. ఇప్పటి వరకు కావ్యశ్రీగా పిలుచుకున్న తమ సంతానానికి కార్తికేయ అనే పేరు మార్చుకున్నట్టు తల్లిదండ్రులు తెలిపారు. 3 వారాల క్రితం ఆధార్ కార్డులో కూడా కార్తికేయగా పేరు మార్పించినట్టు తెలిపారు. కావ్యశ్రీ స్టడీ సర్టిఫికేట్లలో కూడా పేరు మార్చనున్నట్టు తెలిపారు. అయితే.. 2014 నుంచే కార్తికేయ ద్విచక్రవాహనం, కారు నడిపిస్తున్నాడు. ప్రస్తుతం కార్తికేయ ఫ్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా, సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండటం గమనార్హం.
మరోవైపు.. తనకు టీనేజ్ వచ్చేసరికి అబ్బాయిలాగా గడ్డం, మీసాలు రావడం మొదలైందని.. డాక్టర్లను సంప్రదించగా అసంకల్పిత రోమాలు అని చెప్పారని కార్తికేయ తెలిపారు. తనకు తరచూ కడుపు నొప్పి వస్తుండడంతో హైదరాబాద్‌లో పలువురు వైద్యులు కలిశామని.. దీంతో అసలు విషయం తెలిసిందన్నారు. ఇప్పుడు అబ్బాయిగా జీవించడం తనకెంతో ఆనందంగా ఉందని కార్తికేయ చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. కార్తికేయ విషయంలో క్రోమోజోమ్‌ల లోపంతోనే ఇలా జరిగిందని దుబ్బాక ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమారాజ్ సింగ్ వివరించారు. కొన్ని క్రోమోజోమ్‌లు ఎక్కువగా డామినేట్ చేయడం వల్ల వృషణాలు చిన్నగా పెరిగాయని.. కొంత భాగం కడుపులో ముడుచుకొని ఉండిపోయాయని తెలిపారు. తదుపరి వైద్య పరీక్షలకు నిపుణులను సంప్రదించాలని సూచించామనన్నారు. టెస్టిక్యులర్ ఫెమినైజేషన్ సిండ్రోమ్ కారణంగా బయటకు అమ్మాయిలా కనిపించినా అంతర్గతంగా మొత్తం పురుష లక్షణాలే ఉన్నాయని.. ఇది చాలా అరుదైన లక్షణమని హేమారాజ్ సింగ్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa