సంక్రాంతి పండగకు తెలంగాణ సర్కార్ రెండు పథకాలను అమలు చేయనుంది. రైతుల ఖాతాల్లో నగదును జమ చేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కూడా ప్రారంభించనుంది.సంక్రాంతి నాటికి లబ్దిదారులకు ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరు గ్యారెంటీలు ప్రకటించింది. హామీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్లను సంక్రాంతి వరకు మంజూరు చేయాలని నిర్ణయించింది. తొలి విడతలో సొంత స్థలం ఉన్నవారి ఇంటి నిర్మాణం కోసం అనుమతి ఇస్తూ ఆదేశాలను జారీ చేయనుంది. ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలను దశల వారీగా విడుదల చేయనుంది. దీని కోసం ఇప్పటికే తెలంగాణ సర్కార్ యాప్‌ను సిద్ధం చేసింది. దీని ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. స్థలం లేని పేదలకు రెండో విడతలో ఇళ్లను మంజూరు చేయనుంది.రైతు భరోసా నిధులను కూడా సంక్రాంతికి విడుదల చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమయింది.రైతు భరోసా కింద తొలి విడత నిధులను జమ చేయాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం అందుకోసం విధివిధానాలను కూడా ఖరారు చేసింది. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తించేలా తొలుత నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే 10 ఎకరాల్లోపు ఉన్న వారికి మాత్రమే నిధులను అందజేస్తారు. ఆదాయపు పన్ను చెల్లించే వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఈ పథకం వర్తించదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ప్రభుత్వం రైతు భరోసా నిధులను కూడా జమ చేయాలని నిర్ణయించింది.