ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అల్లు అర్జున్ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతీకార పాలనకు తెరలేపారని ఆరోపించారు. ప్రతిపక్షాలపై అటాక్ చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆమె పిచ్చాపాటిగా మాట్లాడారు.ప్రజల కోసం కాకుండా కొందరి కోసమే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వం పేదల కోసం కాకుండా పెద్దల కోసం నడుస్తోందన్నారు. తాము ఊరూరా తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్ఠిస్తామన్నారు. గురుకులాల్లో చనిపోయిన విద్యార్థులకు రూ.25 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ కక్షలతో కేసులు సరికాదన్నారు. ఉమ్మడి పాలకుల కంటే ఇప్పుడే ఎక్కువ నిర్బంధం కనిపిస్తోందన్నారు.రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని... బీజేపీ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసే పని చేస్తున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ దానిని బీజేపీ నడిపిస్తోందని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌పై కేసు నమోదు చేయడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని మరోసారి రుజువుయిందన్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ పెద్దలను కలిసిన తర్వాతే కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.మొదట సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిశారని, ఆ తర్వాత గవర్నర్ కేసు నమోదుకు అనుమతి ఇచ్చారని వెల్లడించారు. ఏసీబీ కేసు నమోదు చేసిన మరునాడే ఈడీ కేసు నమోదు చేసిందన్నారు. దీనిని బట్టి చూస్తే ఆ రెండు పార్టీలు కలిసే పని చేస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు. ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలని బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన పోరాడుతున్నందునే కేటీఆర్‌ను టార్గెట్ చేశారని ఆరోపించారు.మంచి పనులు చేస్తామంటే కేసీఆర్ ఈ ప్రభుత్వానికి ఎన్నో సలహాలు ఇచ్చేవారన్నారు. తెలంగాణలో పది శాతం కమీషన్ ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. మేఘా కృష్ణారెడ్డి వంటి సంస్థలకు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్న ప్రభుత్వం పేదల సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు మాత్రం నిధులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. రుణమాఫీ కాకపోవడంతో చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంకు చీకటి చరిత్ర కారణంగా ఆ బ్యాంకును కేసీఆర్ పదేళ్లు దూరం పెట్టారన్నారు. కాంగ్రెస్ తీసుకొస్తున్న 'భూ భారతి'తో భద్రత ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. 'భూ భారతి' ఒక తిరోగమన చర్య అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తోందని, తాము దీనిని అడ్డుకుంటామని కవిత అన్నారు. గ్రామగ్రామాన తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్ఠిస్తామన్నారు. కేంద్రం నుంచి నిధులు వస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని, కానీ కేంద్రం నుంచి వచ్చిన నిధులు ప్రజలకు చేరడం లేదని ఆరోపించారు. మహాలక్ష్మి కింద ప్రతి మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.30 వేలు బాకీ పడిందన్నారు. తాను కేవలం జగిత్యాలకే పరిమితం కాబోనని... రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతానన్నారు. తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ కలిసే పని చేస్తాయన్నారు.