ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు పెద్ద చిక్కు వచ్చి పడింది. సరిగ్గా క్రిస్మస్ పండగ సమయంలోనే అమెరికన్ ఎయిర్‌లైన్స్ సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో సాంకేతిక సమస్య ఏర్పడటంతో ఆ సంస్థకు చెందిన విమాన సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. టెక్నికల్ సమస్య తలెత్తడంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలు అన్నింటినీ నిలిపివేయాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో అమెరికాలో అన్ని విమాన సర్వీసులను నిలిపివేసినట్లు ప్రకటించింది. క్రిస్మస్ పండగ సందర్భంగా.. వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు.. అమెరికన్ ఎయిర్‌లైన్స్ సంస్థకు సంబంధించి విమాన సేవలు నిలిచిపోవడంతో.. ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
క్రిస్మస్ సెలవుల సందర్భంగా అమెరికాలో సాధారణంగానే లక్షలాది మంది వివిధ ప్రాంతాలకు విమానాల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇలాంటి కీలక సమయంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో టెక్నికల్ సమస్య తలెత్తి.. విమాన సర్వీసులకు ఆటంకం ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనికి సంబంధించి పలువురు ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిపై స్పందించిన సదరు ఎయిర్‌లైన్స్ సంస్థ.. తమ సర్వీసుల్లో ఏర్పడిన సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులు సంయమనం పాటించాలని సూచించింది. అయితే టెక్నికల్ సమస్యపై అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం.
అయితే క్రిస్మస్ పండగ వేళ ప్రయాణాలు బుక్ చేసుకున్న ప్రయాణికులకు అమెరికన్ ఎయిర్‌లైన్స్ సంస్థ క్షమాపణలు చెప్పింది. సాంకేతిక సమస్య కారణంగానే విమాన సర్వీసులు నిలిపివేసినట్లు పేర్కొంది. అయితే అన్ని విమానాలను ఎందుకు రద్దు చేసిందో మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు. ఇక చాలా మంది ప్రయాణికులతో విమానాలు వివిధ ఎయిర్‌పోర్టుల్లో రన్‌వేపై చిక్కుకుపోయినట్లు తెలిపింది. వాటిని తిరిగి పంపిస్తున్నట్లు మాత్రం పేర్కొంది. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని ట్విట్టర్‌లో అమెరికన్ ఎయిర్‌లైన్స్ కంపెనీ స్పష్టం చేసింది.