క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ విడుదలైంది. 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు ఐసీసీ మంగళవారం వెల్లడించింది. క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసే.. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. కాగా ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్య దేశంగా ఉండగా.. భారత్ ఆడే మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి.
9వ ఎడిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తంగా 19 రోజుల పాటు జరగనుంది. ఫిబ్రవరి 19న కరాచీ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. మార్చి 9న ఫైనల్ జరుగుతుంది. మొత్తంగా ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటాయి. ఫైనల్‌తో కలిపి 15 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో పాకిస్థాన్‌లో రావల్పిండి, లాహోర్, కరాచీ మైదానాల్లో మూడేసి చొప్పున లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. లాహోర్‌లో రెండో సెమీఫైనల్ జరగనుంది. ఒకవేళ భారత్ ఫైనల్ చేరకపోతే.. లాహోర్‌లోనే ఫైనల్ కూడా జరుగుతుంది. అలా కాకుండా భారత్ ఫైనల్ చేరితే.. దుబాయ్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది.
భారత జట్టు ఆడే మూడు లీగ్ దశ మ్యాచ్‌లు, సెమీ ఫైనల్ మ్యాచ్‌లు దుబాయ్ వేదికగానే జరగనున్నాయి. పాకిస్థాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీకి తెరలేవనుంది. మొత్తంగా ఈ లీగ్‌లో 8 జట్లు పాల్గొంటాయి. వీటిని రెండు గ్రూప్‌లుగా విభజించారు. అందులో గ్రూప్-ఏలో పాకిస్థాన్, భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, అప్ఘానిస్థాన్, ఇంగ్లాండ్‌లు ఉన్నాయి. ఐసీసీ మెన్స్ క్రికెట్ ప్రపంచకప్ 2023 పాయింట్ల పట్టికలో టాప్-8 స్థానాల్లో ఉన్న జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆడేందుకు అర్హత సాధించాయి.
భారత్ ఆడే మ్యాచ్‌ల షెడ్యూల్..
ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో మ్యాచ్
ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో మ్యాచ్
మార్చి 2న న్యూజిలాండ్‌తో మ్యాచ్
కాగా ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ కోరినట్లుగా హైబ్రిడ్ మోడల్‌లోనే జరగనుంది. ఈ టోర్నీతో పాటు 2024-27 మధ్య భారత్, పాకిస్థాన్ వేదికగా జరిగే అన్ని ఐసీసీ ఈవెంట్లలోనూ భారత్-పాక్ మ్యాచ్‌లు తటస్థ వేదికలోనే నిర్వహిస్తారు. వచ్చే ఏడాది మహిళల క్రికెట్ ప్రపంచ కప్ (భారత్), 2026లో టీ20 ప్రపంచ కప్ (భారత్, శ్రీలంక)లో జరగనున్నాయి. ఈ టోర్నీల కోసం పాకిస్థాన్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించదు. ఆతిథ్య దేశం ప్రతిపాదించిన తటస్థ వేదికల్లోనే మ్యాచ్ జరగనుంది.