ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'యూఏఈ పోర్టులే మా లక్ష్యాలు.. ప్రజలు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలి': ఇరాన్ భీకర హెచ్చరిక

international |  Suryaa Desk  | Published : Sun, Mar 15, 2026, 07:58 PM

పశ్చిమాసియా రణక్షేత్రంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇరాన్‌లోని అతిపెద్ద చమురు కేంద్రం ఖార్గ్ ఐలాండ్‌పై అమెరికా దాడి చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇరాన్ భీకర ప్రతీకారానికి దిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని మూడు కీలక ఓడ రేవులను తమ లక్ష్యాలుగా ప్రకటించిన ఇరాన్.. అక్కడి ప్రజలకు కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా స్థానిక ప్రజలంతా తమ ప్రాణాలు కాపాడుకోవడానికి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని, ప్రాంతాలను ఖాళీ చేయాలని హెచ్చరించింది.


దుబాయ్, అబుదాబి పోర్టులే లక్ష్యంగా..!


ఇరాన్ అధికారిక వార్తా సంస్థ 'తస్నిమ్' వెల్లడించిన వివరాల ప్రకారం.. దుబాయ్‌లోని జెబల్ అలీ, అబుదాబిలోని ఖలీఫా, ఫుజైరా ఓడ రేవులను ఇరాన్ లక్ష్యాలుగా చేసుకున్నట్లు పేర్కొంది. "పౌర సౌకర్యాల మధ్య అమెరికా తన సైనిక బలగాలను దాచి ఉంచుతోంది. అందుకే ఈ ప్రాంతాలపై రాబోయే కొన్ని గంటల్లో దాడులు చేస్తాం. ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి" అని ఇరాన్ హెచ్చరించింది.


ఇరాన్ విప్లవ దళాల (ఐఆర్‌జీసీ) ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాఘారి మాట్లాడుతూ.. యూఏఈ నగరాల మాటున అమెరికా తన దళాలను నడుపుతోందని, ఆ డోకులు, పోర్టులను ధ్వంసం చేసే హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే ఓఢలను కూడా లక్ష్యం చేసుకుంటామని ఐఆర్‌జీసీ ప్రకటించింది.


ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు వాటా ఉన్న హార్మూజ్ జలసంధిని ఇరాన్ దాదాపుగా స్తంభింపజేసింది. అలాగే కువైట్ నుంచి ఒమన్ వరకు ఉన్న శక్తి వనరులే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. ఇప్పటికే సౌదీలోని రాస్ తనూరా, ఖతార్‌లోని రాస్ లఫ్ఫాన్ గ్యాస్ కేంద్రాలు ఇరాన్ దాడికి గురయ్యాయి. "తుపాకులు గర్జిస్తున్నప్పుడు మధ్యవర్తిత్వం గురించి మాట్లాడటం కష్టం" అని యూఏఈ మంత్రి లనా నుస్సేబీ పేర్కొన్నారు. తమ దేశాన్ని లక్ష్యం చేసుకోవడం అత్యంత దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పోర్టులే లక్ష్యంగా చేయబోయే దాడుల గురించి ఆమె తీవ్రంగా ఆందోళన చెందారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa