ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"సరదా కోసం మళ్లీ దాడులు చేస్తాం": ఇరాన్ చమురు కేంద్రాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

international |  Suryaa Desk  | Published : Sun, Mar 15, 2026, 07:53 PM

పశ్చిమాసియాలో యుద్ధం మూడో వారంలోకి ప్రవేశించినా.. ఎక్కడా యుద్ధం ఆగే దాఖలాలు కనిపించడం లేదు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పట్ల మరింత కఠిన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఇరాన్ ఆర్థిక మూలాధారమైన ఖార్గ్ ఐలాండ్ చమురు కేంద్రంపై అమెరికా ఇప్పటికే భారీ దాడులు చేయగా.. తాజాగా సంచలన కామెంట్లు చేశారు. అవసరమైతే సరదా కోసమైనా మరికొన్ని సార్లు అక్కడ బాంబుల వర్షం కురిపిస్తాం అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్లు నెట్టింట వైరల్‌గా మారాయి.


ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభమైన ఈ భీకర పోరులో ఇప్పటి వరకు సుమారు 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికా కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యం చేసుకున్నామని చెబుతున్నా.. ఇస్ఫాహాన్ వంటి నగరాల్లోని పౌర కర్మాగారాలపై కూడా దాడులు జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ ఇప్పటికే మూసివేసింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ఈక్రమంలోనే చమురు అవసరమైన చైనా, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్ వంటి దేశాలు తమ యుద్ధనౌకలను పంపి హార్మూజ్ జలసంధిని రక్షించుకోవాలని.. అమెరికా వారికి పూర్తి సహకారం అందిస్తుందని ట్రంప్ పిలుపునిచ్చారు.


యూఏఈ పోర్టులపై ఇరాన్ ప్రతీకారం


అమెరికా దాడులకు సహకరిస్తున్నారనే నెపంతో ఇరాన్ తన దాడులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైపు మళ్లించింది. దుబాయ్‌లోని జెబల్ అలీ, అబుదాబిలోని ఖలీఫా, ఫుజైరా పోర్టుల నుంచి ప్రజలు వెంటనే వెళ్లిపోవాలని ఇప్పటికే ఇరాన్ హెచ్చరించింది. అవే తమ లక్ష్యాలు అని.. త్వరలోనే వాటిపై బాంబులు, డ్రోన్ల వర్షం కురిపిస్తామని పేర్కొంది. ఇప్పటికే ఫుజైరాలోని ఇంధన నిల్వ కేంద్రాలపై డ్రోన్ దాడులు జరిగాయి. అక్కడ చెలరేగిన మంటలను ఆర్పడానికి సివిల్ డిఫెన్స్ బలగాలు ఇంకా పోరాడుతూనే ఉన్నాయి. ఈక్రమంలోనే ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ తన రక్షణ శాఖ ద్వారా 9 బాలిస్టిక్ క్షిపణులు, 33 డ్రోన్లను యూఏఈ వైపు ప్రయోగించినట్లు ప్రకటించింది.


ఇదిలా ఉండగా.. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి గాయాలు అయ్యాయనే వార్తలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కొట్టిపారేశారు. నాయకత్వం బలంగానే ఉందని, అమెరికా ఎన్ని దాడులు చేసినా లొంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరోవైపు చర్చలకు అమెరికా సిద్ధంగా లేదని, కఠినమైన షరతులు విధిస్తోందని తెలుస్తోంది. చూడాలి మరి మున్ముందు ఏం జరగనుంది అనేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa