ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో పామాయిల్ తయారీ కంపెనీ... యునిలివర్‌తో ఒప్పందం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 21, 2025, 07:25 PM

స్విట్జర్లాండ్‎లోని దావోస్‌లో జరుగుతోన్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్ వార్షిక సదస్సు 2025లో తెలంగాణకు పెట్టుబడులు మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి సర్కార్‌తో ప్రముఖ కంపెనీ తొలి ఒప్పందం చేసుకుంది. నిత్యావసర వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన బ్రాండ్‌లలో ఒకటైన యూనిలీవర్‌ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేసింది. యూనిలివర్ కంపెనీ గ్లోబల్ సీఈవోతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారుల బృందం జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, కంపెనీలకు ప్రభుత్వం కల్పిస్తోన్న సహాయసహకారాలను రేవంత్ రెడ్డి వివరించగా.. సంతృప్తి చెందిన యూనిలివర్ కంపెనీ సీఈవో.. తెలంగాణలో భారీ పెట్టుబడులకు ఆసక్తికనబరిచారు. ఈ క్రమంలో.. తెలంగాణ ప్రభుత్వంతో యునిలివర్ కంపెనీ ఒప్పందం చేసుకుంది.


తెలంగాణలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు యూనిలివర్‌, రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. తొలి విడతలో భాగంగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయనున్నట్టు యూనిలివర్ కంపెనీ తెలిపింది. అలాగే రాష్ట్రంలో బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు యూనిలివర్ కంపెనీ ముందుకు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. యూనిలివర్ కంపెనీ ద్వారా రాష్ట్రంలో యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.


పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్‌లో అత్యంత కీలకమైన సమావేశాలకు సర్వసన్నద్ధమైంది. సప్లయ్ చైన్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఇన్నొవేషన్ రంగాల్లో ప్రఖ్యాత కంపెనీ ఎజిలిటీ వైఎస్ చైర్మన్ తారెక్ సుల్తాన్‌తో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించటంతో పాటు రైతుల ఆదాయాన్ని స్థిరంగా పెంచేందుకు ఇస్తున్న ప్రాధాన్యతలను మంత్రి శ్రీధర్ బాబు ఈ సమావేశంలో వివరించారు.


దావోస్‌లోని తెలంగాణ పెవీలియన్‌లో సందడి నెలకొంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ 55 వ వార్షిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ పెవీలియన్ ప్రారంభించిన తర్వాత కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ నివాదంతో రెండో రోజు అనేక ఉత్తేజకరమైన, పెట్టుబడులకు ఆశాజనకమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.


గ్లోబల్‌ పబ్లిక్‌ పాలసీ, అమెజాన్ వెబ్ సర్వీసెస్‌, సిఫీ టెక్నాలజీస్‌, స్కైరూట్‌ ఎయిరోస్పేస్‌, ఎజిలిటీ, యూపీఎల్ వంటి అగ్రశ్రేణి సంస్థల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సారధ్యంలో వివిధ కంపెనీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. ప్రధానంగా ఐటీ, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ టీమ్ చర్చలు జరుపనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa