కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు )జారీ చేసింది.కుల గణన సర్వే ను తప్పుబడుతూ అభ్యంతరకరమైన భాషతో విమర్శలు చేసి..కులగణన ఫామ్ ను దగ్థం చేయడంపై వివరణ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఓ వైపు శాసన సభ, శాసన మండలిలో కుల గణన నివేదిక వివరాలను ప్రవేశపెట్టిన సందర్భంలో సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మల్లన్న కులగణనను తప్పుబడుతూ విమర్శలు చేయడం ప్రజల్లో, ముఖ్యంగా బీసీ వర్గాల్లో సర్వేపై అనుమానాలను..అపోహలను పెంచేసింది.కులగణనపై అసెంబ్లీలో సాగిన చర్చలో మల్లన్న చేసిన వ్యాఖ్యలనే బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. శాసన మండలిలో సైతం మల్లన్న కులగణన లెక్కలను ప్రశ్నించారు. ఈ పరిణామాల మధ్య కులగణనపై మల్లన్న చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం ఆయనపై చర్యలకు ఉపక్రమించింది. మల్లన్నపై చర్యలకు ముందు పార్టీ సంస్థాగత ప్రక్రియ మేరకు కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
కులగణన సర్వేను ప్రశ్నించడమే కాకుండా మల్లన్న ఇటీవల బీసీ నినాదం ఎత్తుకుని వరుసగా బీసీ సమావేశాలు నిర్వహిస్తూ రెడ్డి సామాజిక వర్గంపైన, సొంత పార్టీ రెడ్డి నేతలపైన ఘాటు విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా వరంగల్ లో నిర్వహించిన బీసీ సభలో రెడ్లపైన, పార్టీలోని రెడ్డి నాయకులపైన మల్లన్న చేసిన విమర్శలపై తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఓ దశలో మాకు రెడ్లు, అగ్రకుల ఓట్లు వద్ధంటు..రెడ్లతో మాకు విడాకులంటూ..రెడ్లు అసలు తెలంగాణ వారే కాదంటూ మల్లన్న తీవ్ర విమర్శలు చేశాడు.రెడ్డి సామాజికవర్గంపై మల్లన్న చేసిన విమర్శల పట్ల పోలీసు ఫిర్యాదులు కూడా చోటుచేసుకున్నాయి. ఆయనపై కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఊపందుకుంది. పలువురు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు మల్లన్న వైఖరిపై మండిపడ్డారు. ఇదే సమయంలోనే మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేపై చేసిన విమర్శలు మరింత వివాదస్పదమై కాంగ్రెస్ నాయకుల్లో ఆయన వైఖరిపై అసహనం రాజేసింది. ఈ పరిణామాలన్ని చివరకు మల్లన్నకు కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసే వరకు దారితీశాయి. మల్లన్న సమాధానం సంతృప్తికరంగా లేని పక్షంలో ఆయనపై వేటు వేయడం ఖాయమన్న ప్రచారం వినిపిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa