ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలపై పోలీసుల వేధింపులు... సివిల్ మ్యాటర్‌లో తలదూర్చిన సీఐ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 27, 2025, 12:33 PM

పేరుకేమో ప్రజాపాలన. జరుగుతున్నదంతా రాక్షస పాలన. ఖాకీలను అడ్డం పెట్టుకుని ప్రజాప్రతినిధులు ముఖ్యంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చేస్తున్న దుర్మార్గాలకు అంతులేదు. దానికి పరాకాష్ట ఈ కథనం. వివరాల్లోకెళితే.... హన్మకొండ జిల్లా, హసన్ పర్తి మండలం, రెడ్డిపురం గ్రామ శివారులో 126 సర్వే నంబరులో ఎకరం ఆస్థి కోసం గతంలో అవతలి పక్షం మధ్య సివిల్ తగాదాలున్నాయి. సదరు సర్వే నంబరులోని జాగా దుగ్లంపుడి టేకులమ్మ భర్త మర్ రెడ్డికి చెందినది. ఈ భూమి కోసం కోర్టులో ఇరువర్గాలు సుధీర్ఘ న్యాయపోరాటం చేశాయి. అయితే ఈ భూ తగాదాను పరిష్కరించేందుకు గౌరవ జిల్లా న్యాయస్థానం అడ్వకేట్ కమిషన్ ని నియమించి ఇరువర్గాల సమక్షంలోనే వారి సమ్మతితోనే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. హన్మకొండ జిల్లా కోర్టు, తెలంగాణ హైకోర్టు సైతం సదరు టేకులమ్మ ఆమె కుమారుడు రంజిత్ కుమార్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. 2017లోనే ఈ భూ తగాదాకు కోర్టులు పరిష్కారం చూపించాయి. 


2019 మే 31 నుంచి గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ గుర్తింపుతో సదరు స్థలానికి ఇంటి పన్ను-కరెంట్ బిల్లు కడుతూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత సదరు స్థలంపై స్థానిక ఎమ్మెల్యే మనుషుల కన్నుపడింది. బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించి... కోర్టు ఆదేశాలను సైతం ముందుపెట్టినా పోలీసు-రెవిన్యూ యంత్రాంగం వాటిని పెడచెవిన పెడుతూ బాధితులను హింసిస్తుండటం ఇపుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఈ తగాదాలోకి స్థానిక ఎమ్మెల్యే  మనుషులు ముఖ్యంగా రజినీకర్ రెడ్డి కొంతమంది రౌడీలతో ఈ స్థలంపై కన్నేశాడు. 2024 మే నుంచి సదరు స్థలాన్ని కబ్జా చేసేందుకు భూ యజమానులకు ఆటంకాలు సృష్టిస్తూ వస్తున్నారు. 2024 ఆగస్ట్ 31 అర్ధరాత్రి స్థలానికి సంబంధించిన ప్రహరీ గోడను, ఇంటిని రజినీకర్ రెడ్డి మనుషులే కూల్చివేశారని బాధితుల అనుమానం. 2025 ఫిబ్రవరి 24న సీసీటీవీ కెమెరాలను సైతం చోరీ చేశారు. 2025 మార్చి 18న రజినీకర్ రెడ్డి 15 మందితో వచ్చి ఈ స్థలంలో తిష్ట వేశాడు. దాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన బాధిత మహిళ రత్న మేరి మీద దుర్భాషలాడుతూ దాడికి దిగారు. ఈ మూడు సందర్భాలలో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించగా తిరిగి వారిపైనే కేసులు నమోదు చేయడం ఇక్కడ ట్విస్ట్. ఈమొత్తం వ్యవహారంలో బాధితులనే బెదిరించేలా పోలీసులు, ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ వ్యవహార శైలి తీవ్ర వివాదస్పదంగా మారింది. 


 


నిజానికి 2025 మార్చి 18న కొంతమంది గుంపుగా వచ్చి సదరు స్థలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటంతో సీఐ రవికుమార్‌కి ఫోన్ చేయగా 100కు డయల్ చేయిస్తే చర్యలు తీసుకుంటామని సీఐ చెప్పారట. తీరా స్థలానికి వెళ్లి 100కు డయల్ చేస్తే ఆమె(D. రత్న మేరి) మీదనే FIR ఫైల్ చేశారు పోలీసులు. అదేమని అడిగితే సదరు స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌పై సదరు మహిళ దాడి చేశారని, దుర్భాషలాడారని కంప్లైంట్ కట్టారు. అక్కడితో ఆగకుండా ఆ స్థలాన్ని వదిలేసి వరంగల్ ఖాళీ చేయకపోతే సదరు మహిళ(రత్న మేరి) మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని సీఐ బెదిరించాడట. ఈ వ్యవహారంలో తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం రాష్ట్రపతికి, జాతీయ మహిళా కమిషన్‌కు, రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. దేశానికి రాష్ట్రపతిగా ప్రథమ మహిళ సారథ్యం వహిస్తున్న ఈ దేశంలో ఓ మహిళకు జరిగే న్యాయం ఇదేనా  అని నిలదీస్తున్నారు. దీనిపై రేవంత్ సర్కారు ఎలా స్పందిస్తుందో చూద్దాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa