తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ స్టీల్ క్యారియర్ అందజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 'సే నో టు ప్లాస్టిక్' అనే నినాదంతో తెలంగాణ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు ఆమె జూట్ బ్యాగు, పుస్తకం, కాపర్ బాటిల్, స్టీల్ క్యారియర్, బట్ట సంచులను పంపిణీ చేశారు.తెలంగాణలో ఎవరూ ప్లాస్టిక్ వాడవద్దని, పర్యావరణాన్ని నష్టపరచొద్దని మంత్రి సురేఖ పిలుపునిచ్చారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'ప్లాస్టిక్ వినియోగం - ప్రమాద ఘంటికలు' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) మెంబర్ సెక్రటరీ రవి పాల్గొన్నారు.