తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఉద్యమ ప్రకటనలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న సమయంలో ఉద్యోగ సంఘాలు సమరానికి దిగడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. "ఉద్యోగ సంఘాలు ఎవరిపై సమరం చేస్తున్నాయి? తెలంగాణ ప్రజలపై సమరం చేస్తారా?" అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వం జీతాలు ఇవ్వకున్నా మౌనంగా ఉన్న ఉద్యోగ సంఘాలు.. నేడు ప్రభుత్వం అడగకుండానే ఒకటో తేదీన జీతాలు ఇస్తుంటే సమరం అంటున్నారని సీఎం మండిపడ్డారు.
ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని, ఉద్యోగ సంఘాలు ఆ కుట్రలో పావులుగా మారొద్దని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కొత్త డిమాండ్లతో ధర్నాలు చేస్తే వ్యవస్థ కుప్పకూలుతుందని, ఉద్యోగ సంఘాలు బాధ్యత మరచి ప్రవర్తిస్తే సమాజం సహించదని సున్నితంగా హెచ్చరించారు. గత ప్రభుత్వంలా కాకుండా ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నందుకా తమపై సమరం చేస్తున్నారని ఆయన నిలదీశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సహకరించాల్సిన ఉద్యోగ సంఘాలే సమరం అంటున్నాయని.. ప్రజలు కష్టాల్లో ఉంటే అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాలపై లేదా అని ప్రశ్నించారు. సమస్యలు ఉంటే కూర్చొని చర్చించుకుందామని ఉద్యోగ సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు సమరం కాదని.. సమయస్ఫూర్తి, సంయమనం అవసరమని రేవంత్ రెడ్డి హితవు పలికారు. ప్రభుత్వం అంటే కేవలం తాము మాత్రమే కాదని, ప్రభుత్వ ఉద్యోగులంతా తమ కుటుంబ సభ్యులేనని ఆయన అన్నారు. రాష్ట్రం పూర్తిగా దివాళా తీసిన స్థితిలో ఉందని.. ఒక్క రూపాయి కూడా అప్పు పుట్టడం లేదన్నారు. అప్పు కోసం బ్యాంకులకు వెళితే దొంగలను చూసినట్లు చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బయట అణాపైసా కూడా చిక్కడం లేదని.. ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకు పోతాడేమో అని తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పినా ఎవరూ నమ్మడం లేదని ఆయన అన్నారు. కనీసం గ్రామాల్లో రోడ్లు వేయాలనే పరిస్థితి కూడా లేదన్నారు. దీనంతటికీ స్వీయ నియంత్రణ మాత్రమే దీనికి పరిష్కారమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ఉద్యోగులు డిమాండ్ల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని, ఏ పథకాలు ఆపి తమ డిమాండ్లు నెరవేర్చాలో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలు తమను కోసినా కూడా.. 18 వేల 500 కోట్లకు మించి ఆదాయమేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలు తనను కోసుకొని తిన్నా కూడా తమ దగ్గర పైసలు లేవని రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు తెలిపారు. ఏ పథకాలు ఆపాలో చెప్పాలంటూ ఉద్యోగులను రేవంత్ రెడ్డి అడిగారు.
ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనని.. అందరం ఒక కుటుంబమని.. అలాంటి కుటుంబ పరువును బజారున పడేయొద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని దివాళా తీయించిన కేసీఆర్ 3 నెలలకు ఒకసారి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వాన్ని తిట్టి పోతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ఫెయిల్ అయ్యాయని చెబుతూ కేసీఆర్ పైశాచికానందం పొందుతున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్రం ఆర్థికంగా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఉద్యోగ సంఘాలు సహకరించి వ్యవస్థను కాపాడాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa