హైడ్రా పేరు చెప్పగానే కబ్జాదారులకు వెన్నులో వణుకు పుట్టాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్రెడ్డి గారు అన్నారు. చెరువులు, నాలాలు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు అనే తేడా లేకుండా.. ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేసేద్దామనే ఆలోచన చేసిన వారికి హైడ్రా ఉందనే భయం ఉండాలని పేర్కొన్నారు. కబ్జా చేసిన వారు ధనికులు, ఆక్రమణదారుల పట్ల కఠినంగా వ్యవహరించి.. పేదల పట్ల సానుభూతితో పని చేయాలని హైడ్రాకు ముఖ్యమంత్రి సూచించారు. గురువారం హైడ్రా పోలీసు స్టేషన్ ను ప్రారంభించారు. అలాగే హైడ్రా వెబ్ సైట్ను కూడా అందుబాటులోకి తెచ్చారు. హైడ్రాకు అందుబాటులోకి వచ్చిన డీఆర్ ఎఫ్ ట్రక్కులు 21, స్కార్పియోలు 55, ద్విచక్ర వాహనాలు 37 , ఇన్నోవాలు 4, మినీ బస్సలు, ట్రూప్ కేరియర్స్ ఐదింటిని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. పేదల అక్రమణలు తొలగించాల్సి వస్తే వారికి ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకు ప్రణాళికలు తయారు చేయాలని హైడ్రా అధికారులకు సూచించారు. అక్రమ నిర్మాణాలను కూలగొడితే రియల్ ఎస్టేట్ పడిపోతోందని గోల చేస్తున్నారు. 400 ఎకరాల్లో ఐటీ పార్క్ అభివృద్ధి చేద్దామని నిర్ణయించుకుంటే అడ్డుపడుతున్నారు. అభివృద్ధి చేయకూడదు, ప్రజలకు మేలు జరగకూడదు అనే ఆలోచనతో కొందరు ఉన్నారు. దావోస్ వెళ్లి 2.20 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చా.. వారికి ఇక్కడ స్థలాలు ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది. అందుకోసమని 400 ఎకరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే అడ్డుకుంటున్నారు.
ప్రకృతిని మనం కాపాడితే.. అది మనకు రక్షణగా ఉంటుందన్నారు. లేని పక్షంలో కాలుష్యంతో, వరదలతో ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరించారు. ముంబయి, చెన్నై, ఢిల్లీలో వరద సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ప్రకృతిని కాపాడుకోకపోవడంతో ఈ దేశాన్ని పరిపాలించే ప్రధాని మంత్రి, హోంమంత్రి ఉండే దిల్లీలో సైతం వరదలు వస్తే పార్లమెంటు నుంచి పాఠశాలల వరకు సెలవులు ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఈ దుస్థితి వచ్చింది. ఈ పరిస్థితి హైదరాబాద్ నగరానికి రాకూడదనే ఉద్దేశంతో విమర్శలను పట్టించుకోకుండా హైడ్రాను ఏర్పాటు చేశాం. హైడ్రా అంటే కూల్చివేతలే కాదు.. చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడడం అనేది అందరూ గ్రహించాలి. హైడ్రాలో డిజాస్టర్ మేనేజ్మెంట్, అసెట్ ప్రొటెక్షన్ ఉంది. వరదలు సంభవించినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది ప్రజలకు అండగా నిలబడుతోంది. ధనికులు గేటెడ్ కమ్యూనిటీ పేరుతో పేదవారు తమ కాలనీల వైపు రాకుండా అడ్డుగా గోడలు కడుతున్నారు. వీటన్నిటిని పరిష్కరించడానికి హైడ్రాను ఏర్పాటు చేశాం. నగరంలో 940 చెరువలు ఉండగా..వాటిలో 491 చెరువుల కబ్జాకు గురయ్యాయి.
హైడ్రా కార్యకలాపాలను వివరించిన కమిషనర్..
హైడ్రా ఏర్పాటు చేసిన నుంచి నేటి వరకూ చేసిన కార్యక్రమాలను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్గారు వివరించారు. వివిధ శాఖల సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. ఎన్నో ఏళ్లుగా అవస్థలు పడుతున్న ప్రజలకు అండగా ఉంటూ.. వారి సమస్యలు పరిష్కరిస్తున్నాం. దళితవాడకు దారి చూపినా.. కాలనీల మధ్య అడ్డుగోడలు తొలగించినా.. సామాన్యుల పక్షమే అని అనేక సంఘటలను రుజువు చేస్తున్నాయన్నారు. ఫిర్యాదులను అన్ని కోణాల్లో పరిశీలించి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని చెరువుల ఎఫ్టీఎల్ను నిర్ధారిస్తున్నాం. నాలాల అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని వివరించారు. ఇప్పుడు పోలీసు స్టేషన్ ప్రారంభంతో కబ్జాల వెనుక ఉన్న సూత్రదారులను కనిపెడతామన్నారు. హైడ్రాకు పూర్తి సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆడియో విజువల్ ద్వారా హైడ్రా కార్యకలాపాలను కళ్లకు కట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa