తెలంగాణ ప్రభుత్వం భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) గడువును పొడిగిస్తూ, నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ ప్రభుత్వం భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను మరింత సరళం చేస్తూ, గతంలో ఉన్న నిబంధనలను సవరించింది. మెట్రోపాలిటన్, పట్టణాభివృద్ధి శాఖ ఈ మేరకు నూతన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా.. 2020లో జారీ చేసిన జీఓ ఎంఎస్ నెం. 131 స్థానంలో జీఓ ఎంఎస్ నెం. 98 ని ప్రభుత్వం తీసుకువచ్చింది.
గతంలో.. తెలంగాణ భూ క్రమబద్ధీకరణ నియమాలు-2020 ప్రకారం, రిజిస్టర్డ్ సేల్ డీడ్, రిజిస్టర్డ్ డీడ్, రిజిస్టర్డ్ సేల్ డీడ్/టైటిల్ డీడ్‌లు ఉన్న ఆమోదం లేని లేఅవుట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకునేది. అయితే.. కొత్త సవరణల ప్రకారం, రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్/రిజిస్టర్డ్ ఎక్స్ఛేంజ్ డీడ్ మరియు వారసత్వం ద్వారా పొందిన భూములలోని ఆమోదం లేని లేఅవుట్లను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోనుంది. ఈ కొత్త సవరణల ద్వారా ఎక్కువ మంది తమ భూములను క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆన్‌లైన్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉంది.
భూముల క్రమబద్ధీకరణ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరడమే కాకుండా, పౌరులకు వారి భూములపై చట్టపరమైన హక్కులు లభిస్తాయి. ఇదిలా ఉండగా.. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద రేవంత్ రెడ్డి ప్రభుత్వం 25 శాతం రాయితీ కూడా ప్రకటించింది.
గతంలో 2020లో ఎల్‌ఆర్‌ఎస్ పథకం ప్రకటించగా, వచ్చిన 25.67 లక్షల దరఖాస్తుల్లో ఇప్పటివరకు 8 లక్షల పరిష్కారమయ్యాయి. మిగిలిన దరఖాస్తుల పరిష్కారం కోసం ఫిబ్రవరిలో ఓటీఎస్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ రాయితీ గడువును మే 31 వరకు పొడిగించింది. గతంలో ఈ గడువును అనేకసార్లు పొడిగించారు.. ఫిబ్రవరిలో ప్రకటించిన వన్ టైమ్ సెటిల్మెంట్ గడువు మొదట మార్చి 31 వరకు ఉండగా, ఆపై ఏప్రిల్ చివరి వరకు .. ఆ తరువాత మే 3వ తేదీ వరకు పొడిగించారు.
ఇటీవల మళ్లీ పెంచి.. ఆదాయాన్ని సమకూర్చునే పనిలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ సవరణలు, గడువు పొడిగింపు ద్వారా ప్రభుత్వం అక్రమ లేఅవుట్లలోని ప్లాట్ల యజమానులకు మరింత వెసులుబాటు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎల్ఆర్ఎస్ అనేది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పథకం. దీని ద్వారా అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పిస్తుంది. సరైన అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్లలో స్థలాలు కొనుక్కున్న ప్రజలకు ఇది ఊరటనిస్తుంది.
![]() |
![]() |