ఆహార పదార్థాల ధరలు, ముఖ్యంగా బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో, తాము బియ్యం కొనాల్సిన అవసరం లేదని జపాన్ మంత్రి టకు ఎటో చేసిన వ్యాఖ్యలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.వివరాల్లోకి వెళితే, ఒక నిధుల సమీకరణ కార్యక్రమంలో మంత్రి టకు ఎటో మాట్లాడుతూ, "మాకు బహుమతులుగా కావాల్సినన్ని బియ్యం వస్తుంటాయి. అందుకే మేం ఎప్పుడూ బియ్యం కొనలేదు" అంటూ వ్యాఖ్యానించారు. దేశంలో నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన వెంటనే రాజీనామా చేయాలంటూ పలువురు డిమాండ్ చేశారు.తన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో మంత్రి టకు ఎటో విలేకరులతో మాట్లాడారు. ప్రజలను ఉత్సాహపరిచే క్రమంలో తాను అలా నోరు జారి మాట్లాడినందుకు క్షమించాలని కోరారు. "బియ్యం కొనక్కర్లేదని నేను అన్న మాటలకు నా భార్య కూడా ఫోన్ చేసి మందలించింది. మన ఇంట్లో మన ఇద్దరమే కాబట్టి బియ్యం ఉంటున్నాయి. ఒకవేళ ఎప్పుడైనా అయిపోతే బయటకు వెళ్లి కొనుక్కోవాల్సిందే కదా అని చెప్పింది" అంటూ తన భార్య మాటలను కూడా ప్రస్తావించారు. అయితే, రాజీనామా డిమాండ్లపై మాత్రం ఆయన స్పందించలేదు.
![]() |
![]() |