ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక వజ్రం లాంటి వారని, ఆయన హృదయంలోంచి వచ్చిన ఆలోచనే 'ఇందిర సౌర గిరి జల వికాసం' పథకమని భట్టి కొనియాడారు. నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, "దేశ చరిత్రలోనే ఇదొక గొప్ప కార్యక్రమం. జల్, జంగల్, జమీన్, భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరాటాల నినాదాలను ఈ ప్రభుత్వం చట్టంగా మారుస్తోంది. ఇలాంటి ప్రభుత్వంలో భాగస్వామిని కావడం నా జన్మ ధన్యమైంది" అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు చాలా గొప్పవని, వజ్రం లాంటి ఆయన మనసులోంచి ఈ పథకం పుట్టిందని పేర్కొన్నారు. ఒకప్పుడు భూమి కోసం ఈ గడ్డపై ఎన్నో పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు."ఈ రోజు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. అటవీ సంపద ఫలాలు పూర్తిగా గిరిజనులకే దక్కాలి. నల్లమల డిక్లరేషన్ ద్వారా గిరిజన కుటుంబాలు మరింత అభివృద్ధి చెందుతాయి. వారికి కేవలం భూములే కాకుండా, వాటిని సాగు యోగ్యం చేసుకునేందుకు అవసరమైన నిధులను కూడా అందిస్తున్నాం" అని భట్టి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పైసాను ప్రజల కోసమే ఖర్చు చేస్తుందని, నిరంతరం ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
![]() |
![]() |