ప్లాస్టిక్ వ్యర్థాలను నియంత్రించకపోతే.. పర్యవారణానికి పెనుముప్పు తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరించారు. నాలాల ద్వార ప్లాస్టిక్ వ్యర్థాలు చెరువుల్లోకి చేరి పర్యావరణానికి పెను సవాల్‌గా మారుతున్నాయన్నారు. నాలాలు, చెరువుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు నియంత్రించడానికి ఎవరికి వారు ముందుకు రావాలని కోరారు. మనం వాడే ప్లాస్టిక్ ఎక్కడకు చేరుతోందనే విషయమై ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురష్కరించుకుని గురువారం హైడ్రా కార్యాలయంలో `పొల్యూషన్ ఆఫ్ వాటర్ బాడీస్` అనే అంశంపై హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో పలువురు పర్యావరణ వేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మాట్లాడారు. నాలాలు, మురుగు నీటి కాలువల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు ఆఖరకు వరదకు అడ్డుగా మారుతున్నాయని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సూచనలు చేయాలని సదస్సుకు హాజరైన పర్యావరణవేత్తలను హైడ్రా కమిషనర్ కోరారు. ప్లాస్టిక్ నిషేధం.. లేదంటే రీసైక్లింగ్ ను పటిష్టంగా చేయడమే పరిష్కారమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. జీహెచ్ ఎంసీ పరిధిలో రోజుకు 8 వేల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోందని.. సరైన నిర్వహణ లేక చెరువులు, నదులు, కుంటలు, వాగులు వ్యర్థాలతో పూడుకుపోతున్నాయని అన్నారు. నగరంలో ఉత్పత్తి అవుతున్న ఈ చెత్తను వేరు చేసి.. ఎరువుగా, ఇంధనంగా వినియోగించడంతో పాటు.. ప్లాస్టిక్‌ను మళ్లీ వినియోగించేలా చూడాలన్నారు.
ప్లాస్టిక్ వ్యర్థాలు ఏ ప్రాంతం నుంచి ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతున్నాయి... నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై దృష్టి పెట్టాల్సినవసరం ఉందన్నారు. చెత్తను కాలువలు, రోడ్డుమీద పడేయవద్దన్నది ఎంత వరకు సమంజసమో.. ఆ చెత్తను ఎక్కడ వేయాలో సూచించడం కూడా అంతే ప్రాధనమైనదిగా భావించాలన్నారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి. కఠిన నిబంధనల అమలు ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యామ్నాయంగా వినియోగించే వారికి రాయతీలు ఇచ్చి ప్రోత్సహించాలని సూచించారు. హైడ్రా అధికారులు, స్వచ్ఛభారత్ ప్రచారకర్త ఎం. సూర్యనారాయణ, స్మరణ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సుభాష్ రెడ్డి, జేఎన్‌టీయూ ప్రొఫెసర్ డా. హిమబిందు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మధులిక చౌదరి తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa