తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో భాగంగా.. లబ్ధిదారులకు విడతల వారీగా ఇంటి పట్టాలను పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలో.. సోమవారం ఖమ్మం జిల్లాలోని చింతకాని మండల కేంద్రంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక వృద్ధురాలు తనకు ఇందిరమ్మ ఇంటి పట్టా లభించిన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది. ఆమె భట్టి విక్రమార్కకు శిరస్సు వంచి నమస్కరించడమే కాకుండా.. సభా వేదికపైనే సంతోషంతో డ్యాన్స్ చేసింది. వృద్ధురాలి ఈ అనూహ్య ఆనందం సభలో ఉన్న ఉపముఖ్యమంత్రి, ఇతర రాజకీయ ప్రముఖులు, అధికారులందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా నిలువ నీడ లేకుండా ఉండకూడదని, ప్రతి పేద కుటుంబానికి ఇంటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రతి వారం ఇంటి బిల్లులు చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఇళ్ల నిర్మాణం ఒక పండుగలా జరుపుకోవాలని, ఎవరైనా తమ గృహప్రవేశానికి ఆహ్వానిస్తే తప్పకుండా వస్తానని సభాముఖంగా తెలియజేశారు. ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు, ప్రతి మహిళకు ఆర్థిక స్థిరత్వం కల్పించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. తన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పేదల కష్టాలను తాను స్వయంగా చూశానని, వారి ఇంటి కలను నెరవేర్చే ప్రభుత్వం తమదేనని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకం పేదల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా.. సొంత స్థలం ఉండి పక్కా ఇల్లు లేని వారికి ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ మొత్తం ఒకేసారి కాకుండా.. ఇంటి నిర్మాణ దశల ఆధారంగా విడతలుగా విడుదల చేస్తుంది. సాధారణంగా ఈ నిధుల పంపిణీ నాలుగు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో భాగంగా.. ఇంటి బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత రూ. లక్ష ఆర్థిక సాయం లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు. రెండో దశలో భాగంగా.. గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత మరో రూ. 1.25 లక్షలు విడుదల చేస్తారు. మూడో దశలో భాగంగా.. స్లాబ్ నిర్మాణం పూర్తయిన తర్వాత రూ. 1.75 లక్షలు అందిస్తారు. నాల్గవ విడతలో భాగంగా.. ఇల్లు పూర్తిగా నిర్మాణం పూర్తయి, గృహప్రవేశానికి సిద్ధమైన తర్వాత మిగిలిన రూ. లక్ష చెల్లిస్తారు.
లబ్ధిదారులు నిర్మాణ పనులను పూర్తి చేసిన తర్వాత.. తాము పూర్తి చేసిన దశకు సంబంధించిన ఫోటోలను తీసి మొబైల్ యాప్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా అధికారులు పరిశీలించి, నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ వినూత్న విధానం నిధుల విడుదలలో పారదర్శకతను, వేగాన్ని పెంచుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారుల దరఖాస్తులను ‘ప్రజా పాలన’ కార్యక్రమం ద్వారా స్వీకరించారు. మొత్తం దరఖాస్తులను మూడు కేటగిరీలుగా (L1, L2, L3) విభజించారు.
L1 కేటగిరీ: సొంత స్థలం ఉండి.. పక్కా ఇల్లు లేని వారు (లేదా గుడిసెలు, పూరిపాకలు, మట్టిమిద్దెలు, రేకుల ఇళ్లలో నివసించేవారు) ఈ జాబితాలో ఉంటారు. వీరికి మొదటి విడతలో ప్రాధాన్యతనిస్తారు.
L2 కేటగిరీ: సొంత స్థలం లేకుండా ఇల్లు లేని వారు (గుడిసెలు, తాత్కాలిక ఇళ్లలో నివసించేవారు) ఈ జాబితాలో ఉంటారు. వీరికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి సహాయం అందిస్తారు.
L3 కేటగిరీ: ఇప్పటికే పక్కా ఇల్లు ఉండి.. వార్షికాదాయం రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నవారు. వీరు ఈ పథకానికి సాధారణంగా అర్హులు కారు.
మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 4,16,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి, జిల్లాలకు ‘హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్లను (PDs)’గా గ్రూప్-1 అధికారులను నియమించారు. ఇళ్ల నిర్మాణం 400 నుండి 600 చదరపు అడుగుల లోపు ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిర్మాణానికి పెట్టుబడి లేని పేదల కోసం మహిళా సంఘాల ద్వారా రూ. లక్ష వరకు రుణాలు అందించే ఏర్పాటు కూడా ఉంది. తెలంగాణలో ఏ ఒక్క పేద కుటుంబం కూడా ఇల్లు లేకుండా ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa