తెలంగాణలో సొంత ఇల్లు కలిగి ఉండాలనే పేదల, మధ్యతరగతి ప్రజల కలను సాకారం చేసేందుకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో.. పోచారంలోని సద్భావన టౌన్షిప్లో మిగిలిన ఫ్లాట్లను తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు సంస్థ ఎండీ వి.పి. గౌతమ్ వెల్లడించారు. ఇటీవల ఆయన పోచారం టౌన్‌షిప్‌ను సందర్శించి.. అక్కడ అందుబాటులో ఉన్న ఫ్లాట్లను, మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. 30 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ టౌన్షిప్ విశాలమైన రహదారులు, మధ్యలో ఖాళీ స్థలం, చక్కటి వెంటిలేషన్ సౌకర్యాలతో నిర్మితమైంది. ఇప్పటికే వెయ్యికి పైగా కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయని గౌతమ్ తెలిపారు.
పోచారంలో ప్రస్తుతం 255 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు రూ.13 లక్షలకు, అలాగే 340 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు రూ.25 లక్షలకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫ్లాట్లు అన్నీ గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భౌగోళికంగా ఈ టౌన్షిప్ వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. ఉప్పల్–నారపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే ఇక్కడి నుంచి కేవలం 10 నిమిషాల ప్రయాణంలో చేరుకోవచ్చు. అంతేకాకుండా.. ఇన్ఫోసిస్, రహేజా ఐటీ పార్క్, ఔటర్ రింగ్ రోడ్డుకు (ORR) సమీపంలో ఈ ఫ్లాట్లు ఉండటం దీని ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. బహిరంగ మార్కెట్లో ఇలాంటి ఫ్లాట్ల ధరలు రూ.50 లక్షలకు తక్కువగా లేవని.. ఈ అరుదైన అవకాశాన్ని మధ్యతరగతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గౌతమ్ కోరారు.
ఈ ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తెలిపింది. దరఖాస్తుదారుల నుంచి టోకెన్ అడ్వాన్స్ స్వీకరించి, లాటరీ పద్ధతిలో ఫ్లాట్లను కేటాయించనున్నారు. పోచారం టౌన్‌షిప్‌తో పాటు, బండ్లగూడ టౌన్షిప్లో కూడా ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు పూర్తి వివరాల కోసం www.swagruha.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. జులై 29వ తేదీ వరకు బండ్లగూడ ప్రాజెక్టు ఫ్లాట్లకు దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. లాటరీ అనేది జులై 30న నిర్వహించనున్నారు. ఇక పోచారం ఫ్లాట్లకు దరఖాస్తులను జూలై 31 వరకు స్వీకరించి.. లాటరీ ద్వారా ఆగస్టు 1న ఇళ్లను కేటాయిస్తారు.
తెలంగాణ ప్రభుత్వం పేదల, మధ్యతరగతి వర్గాల గృహ అవసరాలను తీర్చడానికి కట్టుబడి ఉందని దీని ద్వారా మరోసారి తెలుస్తోంది. నగర శివారు ప్రాంతాల్లో అతి తక్కువ ధరలకు సొంత గృహాలను అందించడం ద్వారా పట్టణీకరణ పెరుగుదలతో పాటు.. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం రాష్ట్రంలో గృహ నిర్మాణ రంగానికి కూడా ఊతమిస్తుంది. ఎండీ వి.పి. గౌతమ్‌తో పాటు అధికారులు భాస్కర్, నరేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, బాలాజీ తదితరులు ఈ పనుల పర్యవేక్షణలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa