కూలగొట్టుడు కాదు.. పర్యావరణ హితమైన, అందరికీ నివాస యోగ్యమైన నగర నిర్మాణమే హైడ్రా లక్ష్యమని కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు స్పష్టం చేశారు. హైడ్రా అంటే భయం కాదని.. నగర ప్రజలందరికీ ఓ అభయం అని అన్నారు. చెరువులు, నాలాలు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కబ్జా చేసిన వారు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని నగర ప్రజలకు సూచించారు. 5 ఎకరాల భూమిని కబ్జా చేసి అందులో పని వాళ్లకోసం ఒక షెడ్డు వేసి .. దానిని తొలగించినప్పుడు వారిని ముందుంచి గేమ్ ఆడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న విషయాన్ని అందరూ గ్రహించాలని కోరారు. `హైడ్రా బస్తీతో దోస్తీ` కార్యక్రమంలో భాగంగా శనివారం టోలీచౌక్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి కార్యక్రమంలో వివిధ బస్తీల నుంచి వచ్చిన ప్రజలను ఉద్దేశించి కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు ప్రసంగించారు. హైడ్రా ఎప్పుడూ పేదలు, సామాన్యుల పక్షమే అని తాము చేస్తున్న కార్యక్రమాలను పరిశీలిస్తే అర్థమౌతుందన్నారు. హైడ్రాను బూచిగా చూపించి వారి కబ్జాలను, ఆక్రమణలను కాపాడుకోడానికి బడాబాబులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. పేదలు ఎక్కడైనా ఇల్లు నిర్మించుకుని ఉంటే వాటిని తొలగించమని.. ఒక వేళ తప్పని సరైతే వారికి ప్రత్యామ్నాయంగా ఎక్కడైనా నివాసాన్ని చూపించి మాత్రమే హైడ్రా ముందుకెళ్తుతందని స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానం కూడా ఇదేనని తెలిపారు. మూసీ నది సుందరీకరణతో హైడ్రాకు సంబంధం లేదు.. నదీప్రవాహానికి అడ్డంగా మారిన కబ్జాలను తొలగించాం. ఇలా 10 ఎకరాల మేర కబ్జా చేసి నెలకు రూ. కోటి ఆదాయం పొందుతున్నవారి భరతం పట్టామన్నారు.
నాలాలను, చెరువులను కాపాడడం అందరి బాధ్యతగా భావించాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు అన్నారు. షేక్‌పేట, టోలీచౌక్ ప్రాంతంలోని విరాట్‌నగర్, బసవతారకం నగర్ ప్రాంతంలో నాలాల్లో పరుపులు, దిండులు, ప్లాస్టిక్ వ్యర్థాలు ఏళ్లుగా పేరుకుపోవడంతో గతంలో వరద ముంచెత్తేది. పది రోజులుగా నాలాల పూడికను తొలగించడంతో ఇప్పుడు వరద సాఫీగా సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులైన స్థానిక కార్పొరేటర్లు, బస్తీల నాయకులతో పాటు.. ప్రజలను హైడ్రా కమిషనర్ అభినందించారు. ఆరోగ్యమైన వాతావరణంలో బతకడం ఓ హక్కు అని.. దీనిని అందరూ కలిసి సాధించుకోవాలన్నారు. చారిత్రక బుల్కాపూర్ నాలాను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో అందరూ సహకరించాలి. అపోలో ఆసుపత్రితో పాటు.. పైన ఉన్న 20కి పైగా బస్తీల నుంచి మురుగు నీరు వస్తోందని.. అంతా ఇక్కడ కలిసి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఫిర్యాదు చేయగానే ఇక్కడ పెద్దయెత్తున నాలా క్లీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టామని హైడ్రా కమిషనర్ చెప్పారు. సీసీటీవీలు కూడా నాలా పొడుగునా పెడతామని.. చెత్త వేసిన వారిని స్థానికులే ఆపాలన్నారు. బస్తీతో దోస్తీ కార్యక్రమం ఆరంభం మాత్రమే.. నగరంలోని 750 బస్తీలకు వరద ముప్పు ఉందనీ.. అన్ని బస్తీల్లో నాలాలను పరిశుభ్రం చేసి ముంపు ముప్పును తప్పిస్తామని హైడ్రా అడిషనల్ డైరెక్టర్ శ్రీ వర్ల పాపయ్య చెప్పారు.
హైడ్రా పేదల పక్షమని మరోసారి రుజువైందని జూబ్లీహిల్స్, షేక్‌పేట కార్పోరేటర్లు శ్రీ వెంకటేష్, శ్రీ ఫరాజ్‌లు అన్నారు. అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట అభివృద్ధే ఇందుకు నిదర్శనమన్నారు. ఇక్కడ నాలాలు పొంగి నివాసాలను ముంచెత్తుతున్నాయనగానే.. హైడ్రా కమిషనర్ చర్యలు తీసుకున్నారు.. ఇది కదా పేదల పక్షం హైడ్రా అని చెప్పడానికి నిదర్శనమన్నారు. 20 ఏళ్లుగా సిల్ట్ తీయడం జరగలేదని.. దీంతో వర్షం పడినప్పుడల్లా నివాసాలను వరద ముంచెత్తేదని.. పాత వీడియోలను చూపించారు. ప్రస్తుతతం నాలాలు శుభ్రంగా మారడాన్ని మనం చూస్తున్నాం.. ఇది నిరంతరంగా జరగాలని కోరుతున్నామన్నారు. హైడ్రా అంటే అపోహలు తొలగిపోయాయి.. పనిచేసి చూపించేదే హైడ్రా అని రుజువైందని వివిధ బస్తీల ప్రతినిధులు అన్నారు. 10 రోజుల్లో రెండుసార్లు మా బస్తీలను సందర్శించి.. నాలా పూడిక తీత పనులను స్వయంగా పరిశీలించిన హైడ్రా కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. హైడ్రా సిబ్బంది కూడా అదే దీక్షతో పని చేసి మా సమస్యను పరిష్కరించారని.. అందరికీ అభినందనలంటూ సభాముఖంగా కొనియాడారు. హైడ్రా బస్తీతో దోస్తీ కార్యక్రమాన్ని మా బస్తీల నుంచే మొదలు పెట్టడం సంతోషంగా ఉందని.. పూర్తి మద్ధతు ఉంటుందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa