ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బండి సంజయ్‌ను కాపాడిన జగన్మోహన్ రెడ్డి..! ఎప్పుడు..? ఎలా..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 18, 2025, 04:26 PM

నక్సల్స్‌ ఏరివేతే లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌‌ను ఎందుకు ఎత్తివేయాలో చెప్పాలని తెలంగాణ సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. శనివారం (ఆగస్టు 16న) కరీనంగర్‌లో 'నక్సల్స్‌ నరమేధం-మేథోమథనం' చర్చలో బండి సంజయ్‌ పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు నక్సల్స్‌తో చర్చలు జరిపిన వారు ఏం సాధించారని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ నక్సలిజంపై తన వైఖరిని మార్చుకున్నారన్నారు. ఆపరేషన్‌ కగార్‌ను ఆపి నక్సలైట్లతో చర్చలు జరపాలని రేవంత్‌ రెడ్డి, కేసీఆర్‌ కోరటం హాస్యాస్పదమన్నారు.


'నక్సలిజాన్ని పూర్తిగా అణచివేస్తాం. పేదరికం ఉన్నంత వరకు నక్సలిజం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆపరేషన్ కగార్ ఆపేసి, మావోయిస్టులతో చర్చలు జరపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరణిస్తున్న ఇలాంటి తరుణంలో.. ఏబీవీపీ ఆధ్వర్యంలో నక్సల్స్ నరమేధం - మేధోమధనం పేరిట సదస్సు నిర్వహించడం స్వాగతించాల్సిన విషయం’ అని సంజయ్ అన్నారు.


‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ దేశంలో 220 జిల్లాల్లో నక్సలైట్ల సమస్య ఉంది. మోదీ సర్కారు ఏర్పడిన తర్వాత 12 జిల్లాలకే ఈ సమస్య పరిమితమైంది. వచ్చే మార్చి నాటికి దేశంలో నక్సలిజం అనేది కనిపించకుండా పోతుంది. నక్సలిజం ఇప్పటి దాకా సాధించింది శూన్యం. డెవలప్‌మెంట్‌ను నక్సలైట్లు అడ్డుకున్నారు. నక్సలిజం దేనికి పనికిరాదనే విషయాన్ని సమాజం గుర్తించాలి. ఇప్పటి దాకా 50 వేల మందిని నక్సలైట్లు పొట్టనబెట్టుకున్నారు.


అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలను నక్సలైట్లు పొట్టనబెట్టుకున్నారు. ఏ స్వలాభం లేకుండా విద్యా రంగం సమస్యల పరిష్కారం కోసం పని చేసిన సంస్థ అఖిల భారత విద్యార్థి పరిషత్. ఏబీవీపీకి చెందిన 50 మంది కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు నక్సల్స్ చేతిలో బలయ్యారు. శక్తివంతమైన భారతదేశం కావాలనే ఉద్దేశంతోనే ఏబీవీపీ కార్యకర్తలు పని చేశారు. జాతీయ జెండా ఎగరేశారంటూ సామా జగన్ రెడ్డి లాంటి ఏబీవీపీ కార్యకర్తలకు నక్సలైట్లు వార్నింగ్ ఇస్తూ పోస్టర్లు వేశారు. అయినా సరే ఏబీవీపీ కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.


‘ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయినా సరే దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం, పేదలు ఉన్న ప్రాంతం ఛత్తీస్‌గఢ్. అక్కడ జాతీయ పతాకాన్ని సైతం ఎగరేసే పరిస్థితి లేదు. దేశంలో నక్సలిజం పాతుకుపోయింది. ఏ జిల్లాలో, ఏ రాష్ట్రంలో పేదరికం లేకుండా నక్సలైట్లు చేయగలిగారో చెప్పాలి? తుపాకీ గొట్టం ద్వారా వాళ్లు సాధించింది ఏమిటి? నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భద్రత, అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యం అనే మూడు విధానాలతో.. నక్సల్ ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. నకల్సిజం నిర్మూలనలో నరేంద్ర మోదీ సర్కారు విజయవంతమైంది.


ఆపరేషన్ కగార్ ఆపేయండని కేసీఆర్ కోరుతున్నారు. టేబుల్ మీద తుపాకీ పెట్టి చర్చలు జరిపే ప్రభుత్వం బీజేపీది కాదు. చర్చల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిందేమీ లేదు. తుపాకీ అనేది చట్టాన్ని కాపాడే పోలీసు, దేశాన్ని కాపాడే జవాన్ చేతిలోనే ఉండాలి తప్పితే.. విధ్వంసకర శక్తుల చేతిలో ఉండొద్దని మోదీ సర్కారు సంకల్పం తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నక్సలిజాన్ని నిషేధించారు. మరి కేసీఆర్ నక్సలిజంపై నిషేధాన్ని ఎందుకు ఎత్తేయలేదు. రేవంత్ రెడ్డి కూడా ఆ పని ఎందుకు చేయట్లేదు. ఏబీవీపీ కార్యకర్తగా ఉన్నప్పుడు నక్సలైట్లు నా మీద కూడా పోస్టర్లు వేశారు. నేను పాటలు పాడినప్పుడు.. పాటలు పాడటం బంద్ చేయాలి లేదంటే ప్రజల మధ్య గుణపాఠం చెప్తామని పోస్టర్లు వేశారు. నేను మొన్ననే మాట్లాడా.. జగన్ మోహన్ రెడ్డి అనే సీఎం ఉన్నడు.. ఆయనే కాపాడిండు నన్ను. ఇప్పటికీ అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు సమాజం కోసం పని చేస్తున్నారు.


సామా జగన్ మోహన్ రెడ్డి, జితేందర్ రెడ్డి తదితర విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమరులయ్యారు. చదువు కావాలా లేదా తుపాకీ కావాలా అనేది సమాజం చర్చించాలి. కాంగ్రెస్ పార్టీకి చెందిన స్పీకర్ శ్రీపాదరావును, చిట్టెం నర్సిరెడ్డిని నక్సల్స్ హతమార్చారు. అనేక మంది అమాయక పోలీసులను నక్సలైట్లు హత్య చేశారు. డ్యూటీ చేసి భార్య శ్రీమంతానికి వెళ్తున్న సీఐను నక్సల్స్ చంపేశారు. దూరదర్శన్ రిపోర్టర్‌ను చంపేశారు. నక్సల్స్ అనేక రకాలుగా విధ్వంసం సృష్టించారు.' అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.


కాగా, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సీఎం ఉండటం ఏంటని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఉమ్మడి ఏపీలో ఆ పేరుతో ఎవరూ ముఖ్యమంత్రిగా పని చేయలేదు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పాల్సిందిపోయి పొరపాటున జగన్మోహన్ రెడ్డి పేరును బండి సంజయ్ చెప్పి ఉండవచ్చేమో అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే వైఎస్ సీఎంగా అయ్యే నాటికి సంజయ్.. బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చేశారు. స్థానికంగా కొందరు చెప్పిన విషయం ఏంటంటే.. బండి సంజయ్ చెప్పింది సీఎం జగన్మోహన్ రెడ్డి అని కాదు.. సీఐ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారని.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa