తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఉన్న రాజకీయ పార్టీల అధినేతలకు.. సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక విన్నపం చేశారు. త్వరలో జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలో.. దేశంలోని ప్రతిపక్షాల ఇండియా కూటమి అభ్యర్థి అయిన తెలుగు వ్యక్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, వామపక్షాలకు రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. తెలుగు వ్యక్తిని గెలిపించుకుని.. ఉపరాష్ట్రపతిని చేయాలని విజ్ఞప్తి చేశారు. పీవీ నరసింహారావు తర్వాత జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి ఇలాంటి అత్యున్నత గౌరవం దక్కిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
పార్టీలకు అతీతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ప్రకటించిన నేపథ్యంలో తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించడం తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. కేసీఆర్, చంద్రబాబు, జగన్, పవన్, అసదుద్దీన్.. పార్టీలు, రాజకీయాలను పక్కన పెట్టి ఒకే మాటపై నిలబడి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొన్న రేవంత్ రెడ్డి.. ఓట్లను చోరీ చేసి.. దేశాన్ని పరిపాలించాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని రక్షించడం అనేది మనందరి బాధ్యత అని.. ఇప్పుడు రాజ్యాంగ సంస్థలను రక్షించుకోవడం అవసరమని తెలిపారు. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని ఓడించి.. రైతు కుటుంబంలో పుట్టిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడమే కాకుండా.. రాజ్యాంగ నిపుణుడిగానూ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి పేరు ఉందని తెలిపారు.
సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తున్నట్లు.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇవాళ ప్రకటన చేశారు. ఈ నిర్ణయానికి ఇండియా కూటమిలోని ప్రతిపక్ష పార్టీలు అన్నీ మద్దతు తెలిపాయని వివరించారు. ఎన్డీఏ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని బీజేపీ విజ్ఞప్తి చేయగా.. అలాంటి సమయంలోనే ఇండియా కూటమి తమ అభ్యర్థిని ప్రకటించడం గమనార్హం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, గువాహటి హైకోర్టులతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి పనిచేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకులమైలారం గ్రామంలో 1946 జులైలో జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి పుట్టారు. 1971లో ఉస్మానియా యూనివర్సిటీలో లా డిగ్రీని పూర్తి చేశారు. అదే ఏడాది డిసెంబర్ 27వ తేదీన బార్ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్న ఆయన.. 1995 మే 2వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా నియమకం అయ్యారు. 2005లో గువాహటి హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పని చేసిన జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి.. 2007 నుంచి 2011 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగాను సేవలందించారు. 2013 మార్చిలో గోవా తొలి లోకాయుక్తగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 7 నెలల్లోనే వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa