హైదరాబాద్ నగరంలోని పుస్తక ప్రియులకు గుడ్‌న్యూస్. నగరంలో ప్రపంచ స్థాయి పబ్లిక్ లైబ్రరీ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ అంతర్జాతీయ డిజిటల్ సర్వీసెస్, సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన కోఫోర్జ్ లిమిటెడ్ 15 వేల పుస్తకాలతో నగరంలో ఈ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభించింది. అత్యాధునిక సదుపాయాలతో అతిపెద్ద లైబ్రరీని అందుబాటులోకి తీసుకువచ్చారు. నోయిడా , గురుగ్రామ్‌లలో విజయవంతంగా లైబ్రరీలను ప్రారంభించిన కోఫోర్జ్.. కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం కింద నగరంలో మూడో మూడో లైబ్రరీని ఏర్పాటు చేసింది.
కొండాపూర్ నివాస ప్రాంతానికి ఆనుకుని.. కొత్తగూడలోని ప్రణవ బిజినెస్ పార్క్ 8వ అంతస్తులో ఈ లైబ్రరీని ఏర్పాటు చేశారు. 15,660 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ లైబ్రరీలో ఫ్లోర్-టు-సీలింగ్ గ్లాస్ గోడల ద్వారా నగర అందాలను చూడొచ్చు. పూర్తిగా ఎయిర్ కండిషన్ చేయబడిన ఈ లైబ్రరీలో వీల్‌చైర్ వినియోగదారులకు సౌలభ్యంగా ఉండేలా విశాలమైన కారిడార్లు, చిన్నారి విద్యార్థులను ఆకర్షించేలా ప్రత్యేకంగా రూపొందించిన చిల్డ్రన్స్ జోన్ ఉన్నాయి.
ఈ లైబ్రరీలో ఫిక్షన్, థ్రిల్లర్స్, ప్రయాణం, పిల్లల సాహిత్యం, సెల్ఫ్-హెల్ప్, మేనేజ్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), పర్యావరణం, కవిత్వం, ఆత్మకథలు, గ్రాఫిక్ నవలలు, రాజకీయాలు వంటి అనేక అంశాలకు సంబంధించిన 15,000కు పైగా పుస్తకాలు ఉంచారు. ఈ జాబితాలో అవార్డులు పొందిన రచయితల పుస్తకాలు, విలువైన రిఫరెన్స్ శీర్షికలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా.. పాఠకులకు సులభంగా సేవలు అందించేందుకు పూర్తిగా డిజిటలైజ్ చేయబడిన కేటలాగింగ్, నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఉచిత ప్రవేశం, నిరంతర సేవలు
ఈ కో ఫోర్జ్ పబ్లిక్ లైబ్రరీ అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఇది సంవత్సరంలో 365 రోజులు, ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. జ్ఞానానికి ద్వారంగా, వ్యక్తిగత ఎదుగుదలకు ఉత్ప్రేరకంగా, స్థానిక సమాజంలో సమ్మిళిత అభివృద్ధికి మూలస్తంభంగా ఈ లైబ్రరీ ఉపయోగపడుతుందని కోఫోర్జ్ ప్రతినిధులు వెల్లడించారు.
సమాజంలో మానవుల ఎదుగుదలకు లైబ్రరీలు అమూల్యమైన వనరులని, దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయని తాము నమ్ముతున్నట్లు కోఫోర్జ్ చీఫ్ బ్రాండ్ అండ్ సస్టైనబిలిటీ ఆఫీసర్ అనురాధ సెహగల్ తెలిపారు. హైదరాబాద్ ప్రజలకు ఈ అద్భుతమైన సదుపాయాన్ని అందిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఇది భవిష్యత్తు తరాలకు జీవితకాల అభ్యాసానికి పుణ్యక్షేత్రంగా మారుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa