ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాలాల‌తో పాటు చెరువుల‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 01, 2025, 12:00 PM

వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్టాయి. నాలాల్లో వ‌ర‌ద ప్ర‌వాహం త‌గ్గే అవ‌కాశం ఉంది. ఈ ప‌రిస్థితుల‌ను వినియోగించుకుని నాలాల్లో పూడిక‌ను పూర్తి స్థాయిలో తొల‌గించాల‌ని హైడ్రా డీఆర్ ఎఫ్‌, మెట్ టీమ్‌ల‌కు క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ దిశానిర్దేశం చేశారు. న‌గ‌ర‌వ్యాప్తంగా నాలాల్లో పూడిక తీసే ప‌నుల‌ను ముమ్మ‌రం చేయాల‌ని సూచించారు. చాలా వ‌ర‌కు పూడిక‌ను తొల‌గించ‌డంతో  ఈ ఏడాది భారీ వ‌ర్షాలు ప‌డినా ఎక్క‌డా వ‌ర‌ద ముప్పు ఏర్ప‌డ‌లేద‌ని.. వ‌చ్చే ఏడాది అస్స‌లు ఈ స‌మ‌స్య త‌లెత్తే అవ‌కాశం లేకుండా చూడాల్సిన బాధ్య‌త మ‌న‌పై ఉంద‌న్నారు. ప్ర‌జావాణి ఫిర్యాదుల మేర‌కు న‌గ‌రంలోని నాలాల‌ను, చెరువుల‌ను ప‌రిశీలిస్తూ వ‌స్తున్న హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు శుక్ర‌వారం జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలోని ర‌హ‌మ‌త్‌న‌గ‌ర్‌, బోర‌బండ ప్రాంతాల‌లో నాలాల్లో పూడిక తీత ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించారు.  నాలాల్లో పూడిక తీత ప‌నుల‌కు, వ‌ర‌ద ప్ర‌వాహానికి ఆటంకాల‌ను తొల‌గించేందుకు ఇదే స‌రైన స‌మ‌యంగా భావిచాల‌ని హిత‌వుప‌లికారు. అలాగే ప్రాంతాల వారీ వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి స‌మాచారాన్ని చేర‌వేయాల‌ని సూచించారు. అలాగే హ‌రిహ‌ర‌పురంలోని కాప్రాయి చెరువుతో పాటు.. శంషాబాద్‌, పెద్ద‌గోల్కొడ‌లోని న‌ర‌సింహ చెరువు, బాలాపూర్ మండ‌లంలోని కోమ‌టి కుంట‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ప‌రిశీలించారు. వ‌ర్షాకాలం ఏ ప్రాంతాల్లో వ‌ర‌ద నీరు నిలిచింద‌నేది ఇప్ప‌టికే తెలిసింది క‌నుక‌.. వ‌చ్చే ఏడాది అలాంటి అవ‌కాశం లేకుండా జాగ్ర‌త్త ప‌డాల‌న్నారు.


న‌గ‌రంలో చెరువుల‌ను అభివృద్ధి చేసి వ‌ర‌ద‌ల‌ను నియంత్రించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్  శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు ఆదేశించారు. వ‌ర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని చెరువుల‌ను త‌గిన మొత్తంలో ఖాళీ చేయించి.. వ‌ర‌ద నీరు నిలిచేలా చూడాల‌న్నారు. ఎల్‌బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని హ‌రిహ‌ర‌పురం కాల‌నీలో ఉన్న కాప్రాయి చెరువుకు ఔట్‌లెట్‌లు లేక ఎగువున ఉన్న త‌మ కాల‌నీలు నీట మునుగుతున్నాయ‌ని స్థానికులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేయ‌డంతో హైడ్రా క‌మిష‌న‌ర్ క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. ఇన్‌లెట్ ద్వారా ఎంత మొత్తంలో వ‌ర‌ద వ‌స్తుందో అంతే మొత్తం కింద‌కు వెళ్లేలా  ఏర్పాట్లు చేయాల‌ని క‌మిష‌న‌ర్ సూచించారు. ఔట్‌లెట్‌లు లేక‌పోవ‌డంతో చెరువు నిండి త‌మ నివాస‌లు నీట మునుగుతున్నాయ‌ని హ‌రిహ‌ర‌పురం కాల‌నీ నివాసితులు వాపోయారు. వ‌ర‌ద నీరు చెరువులోకి వెళ్ల‌కుండా డైవ‌ర్ట్ చేయ‌డం వ‌ల్ల స్నేహ‌మ‌యిన‌గ‌ర్‌, అఖిలాండేశ్వ‌రి, గ్రీన్‌ల్యండ్స్ తో పాటు ఏడెనిమిది కాల‌నీలు నీట మునుగుతున్నాయ‌న్నారు. మ‌రీ ముఖ్యంగా కాప్రాయి చెరువు కింద ఉన్న కాల‌నీల్లోని నాలాల్లో పూడిక‌ను తొల‌గిస్తే మురుగు ర‌హ‌దారుల‌ను ముంచెత్త‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చున‌న్నారు. పూడిక తీత నిరంత‌ర ప్రక్రియ‌గా సాగాల‌ని సూచించారు. వెంట‌నే ఈ ప‌నులు చేప‌ట్టాల‌ని హైడ్రా డీఆర్ ఎఫ్ అధికారుల‌ను క‌మిష‌న‌ర్ ఆదేశించారు.


శంషాబాద్ మండ‌లం చిన్న‌గోల్కొండ‌, పెద్ద గోల్కొండ ఔటర్ రింగురోడ్డు అండ‌ర్ పాస్‌లు వ‌ర‌ద నీటిలో మునుగుతున్నాయ‌ని తాము పాఠ‌శాల‌కు వ‌ర్షాకాలం వెళ్ల‌లేక‌పోతున్నామ‌ని విద్యార్థినులు హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారికి ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బ‌స్సులో తాము స్కూల్‌కు వెళ్తామ‌ని.. ఇటీవ‌ల తాము ప్ర‌యాణిస్తున్న బ‌స్సు అండ‌ర్‌పాస్ కింద నీటిలో ఆగిపోవ‌డంతో ఇబ్బంది ప‌డ్డామ‌ని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ స‌మ‌స్య‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని శుక్ర‌వారం ఆ ప్రాంతాల‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారిని క‌లిసి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. ఇక్క‌డ అండ‌ర్ పాస్‌ల‌న్నిటి ప‌రిస్థితి ఇలాగే ఉంటుంద‌ని.. వ‌ర్షం ప‌డితే ఇబ్బందిగా ప‌రిణ‌మిస్తున్నాయ‌ని విన‌తిప‌త్రంలో పేర్కొన్నారు.  ఇక్క‌డ వ‌ర‌ద కాలువ‌ల్లో పూడిక‌ను తొల‌గించి.. స‌రైన విధంగా నిర్వ‌హిస్తే ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూప‌వ‌చ్చున‌ని.. వెంట‌నే ఈ ప‌నులు చేప‌ట్టాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ అధికారుల‌కు సూచించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa