హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి 65 త్వరలో పూర్తి స్థాయి స్మార్ట్ రోడ్డుగా, హై సెక్యూరిటీ హైవేగా రూపాంతరం చెందనుంది. ఈ కీలకమైన రహదారి విస్తరణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రమాదాలను నియంత్రించడం, పూర్తి భద్రతా ప్రమాణాలను పాటించడం లక్ష్యంగా ఈ మహత్తర ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నారు. ఇప్పటికే నాలుగు వరుసలుగా ఉన్న ఈ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు అధికారికంగా చర్యలు ప్రారంభమయ్యాయి. జాతీయ రహదారి 65 ను సురక్షితంగా మార్చేందుకు తీసుకున్న నిర్ణయంతో.. ఈ దారి పొడవునా ఎక్కడ ఏం జరిగినా స్పష్టంగా తెలిసేలా డిజిటల్, స్మార్ట్ రోడ్డుగా తయారవుతుంది.
తెలంగాణ పరిధిలోని మల్కాపూర్ వద్ద ఆందోల్ మైసమ్మ దేవాలయం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో కనకదుర్గమ్మ దేవాలయం వరకు సుమారు 231.32 కిలోమీటర్ల మేర ఈ ఆరు వరుసల విస్తరణ జరగనుంది. రహదారిపై అత్యంత అధునాతనమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. వీటిని పూర్తిగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో అనుసంధానం చేస్తారు. నిఘా వ్యవస్థలో భాగంగా.. 360 డిగ్రీల కోణంలో పనిచేసే సీసీ కెమెరాలను ప్రతి కిలోమీటర్‌కు ఒకటి చొప్పున, రెండు వైపులా కలిపి మొత్తంగా 231 కెమెరాలను అమర్చేందుకు నిర్ణయించారు. ఈ శక్తివంతమైన కెమెరాలు 24 గంటలు నిఘా ఉంచుతాయి.. తద్వారా ప్రమాదాలు పెద్ద ఎత్తున తగ్గేందుకు అవకాశం ఉంటుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించి, స్మార్ట్ రోడ్డుగా మార్చేందుకు భారీగా నిధులు అవసరం అవుతాయని ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేశారు. దీనికి మొత్తం రూ. 10,391.53 కోట్ల నిధులు అవసరం. ఇందులో నిర్మాణ వ్యయం రూ. 6,775.47 కోట్లు కాగా.. ఇతర అవసరాలకు రూ. 3,616.06 కోట్లు కావాల్సి ఉంటుంది.
రహదారిపై సోలార్ ద్వారా వీధి దీపాలు ఏర్పాటు చేయడం, రోడ్డు పక్కన భద్రతా బారికేడ్లు , వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు, రోడ్డుకు ఇరువైపు మొక్కలు నాటడం వంటి మౌలిక వసతుల కల్పన కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా అలాగే, వాణిజ్య వ్యాపారాలను ప్రోత్సహించేలా ఏర్పాట్లు చేయనున్నారు. విజయవాడకు కీలకమైన ఈ రహదారి విస్తరణ, సురక్షిత రవాణాకు, పారిశ్రామికాభివృద్ధికి దోహదపడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa