ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెట్రో టైమింగ్స్ మారిపోయాయ్, చెక్ చేసుకోండి!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 01, 2025, 07:57 PM

ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో బ్యాడ్‌న్యూస్ చెప్పింది. మెట్రో రైళ్ల టైమింగ్స్ మారినట్లు వెల్లడించింది. ఉదయం 6 గంటలకు ప్రారంభం కానున్న మెట్రో రైళ్లు రాత్రి 11 గంటల వరకు మాత్రమే ప్రయాణిస్తాయని తెలిపారు. నవంబర్ 3వ తేదీ నుంచి ఈ కొత్త షెడ్యూల్ అమల్లోకి రానున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి మొదటి రైలు ఉదయం 6 గంటలకు బయలుదేరుతుందని.. అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి రైలు రాత్రి 11 గంటలకు బయలుదేరుతుందని పేర్కొంది. వారంలోని అన్ని రోజులూ ఇదే రకమైన టైమింగ్స్ అమల్లోకి వస్తాయని తెలిపింది.


దీనికి సంబంధించి ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. ఈ నిర్ణయం కారణంగా హైదరాబాద్‌ మెట్రో రైళ్లలో రాత్రి 11 దాటిన తర్వాత ప్రయాణాలు చేసే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఆ సమయంలో బస్సులు చాలా తక్కువ సంఖ్యలో అందుబాటులో ఉండగా.. ఇప్పుడు మెట్రో రైళ్లు కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే రాత్రి వేళల్లో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతో.. అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


ఇప్పటివరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు అన్ని టెర్మినల్‌ స్టేషన్ల నుంచి చివరి మెట్రో ట్రైన్లు రాత్రి 11.45 గంటలకు బయలుదేరేవి. అక్కడి నుంచి చివరి స్టేషన్‌కు చేరుకునేందుకు దాదాపు 45 నుంచి 50 నిమిషాల వరకు సమయం పట్టేది. దీంతో అర్ధరాత్రి ప్రయాణాలు చేసే ప్రయాణికులకు కూడా వీలు ఉండేది.


అయితే మొదట్లో ఇవే రకమైన టైమింగ్స్ ఉండేవి. కానీ ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాత్రి వేళ చివరి రైళ్లను.. ప్రారంభ స్టేషన్ నుంచి 11 గంటలకు బదులు.. 11.45 గంటలకు బయలుదేరేవి. ఇవి కేవలం వీక్ డేస్ అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఉండేవి. ఇక అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి ఆదివారం రోజున తొలి మెట్రో రైలు ఉదయం 6 గంటలకు బదులు ఉదయం 7 గంటలకు ప్రారంభం అయ్యాయి. అదే సమయంలో సోమవారం రోజున ప్రయోగాత్మకంగా తెల్లవారుజామున 5.30 గంటలకు ప్రారంభం అయ్యేవి. అయితే ఇవన్నీ వర్కౌట్ కాకపోవడం వల్ల మళ్లీ పాత పద్దతిలోనే రైళ్లను నడపనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa