తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం ట్రాఫిక్ పోలీసులకు, నగర ప్రజలకు పెద్ద సవాలుగా మారింది. ఈ ప్రమాదకరమైన అలవాటు కేవలం రద్దీని పెంచడమే కాకుండా... ప్రాణాపాయ ప్రమాదాలకు దారితీస్తుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ శాఖ ఇటీవల భారీ స్థాయిలో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తోంది.
7 రోజుల్లో 10,652 కేసులు..
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వివరాల ప్రకారం.. అక్టోబర్ మొదటి వారంలో నిర్వహించిన వారం రోజుల ప్రత్యేక డ్రైవ్‌లో ఏకంగా 10,652 మంది మోటారిస్టులపై రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులు నమోదు అయ్యాయి. నగరంలోని మల్టీలేన్ రోడ్లు, యూ-టర్న్‌లు, మార్కెట్ ప్రాంతాలు, రెసిడెన్షియల్ జోన్ల వద్ద ఈ రకమైన ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో రెండు చక్రాల వాహనదారులు ట్రాఫిక్‌ను తప్పించేందుకు డివైడర్‌ను దాటడం, లేదా వ్యతిరేక దిశలో నడిపించడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి.
‘మోటారిస్టులు సమయం ఆదా చేసుకోవడానికీ.. సిగ్నల్ల వద్ద రద్దీ తప్పించుకోవడానికీ రాంగ్ రూట్ తీసుకుంటున్నారు. దీని ఫలితంగా గత కొన్నేళ్లలో అనేక మరణాలు సంభవించాయి,’ అని ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే తెలిపారు. ఈ సమస్యను నియంత్రించేందుకు ట్రాఫిక్ శాఖ మొబైల్ పెట్రోల్స్, సీసీటీవీ ఆధారిత పర్యవేక్షణ, స్థిరమైన చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తోంది. ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి. జోయెల్ డేవిస్ వంటి సీనియర్ అధికారులు ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రవాణా శాఖతో కలిసి సడన్ ఆపరేషన్లు నిర్వహించి.. వాహనాలను సీజ్ చేసి.. వెంటనే చలాన్లు జారీ చేస్తున్నారు.
‘పోలీసు సిబ్బంది పరిమితంగా ఉన్నా.. రోడ్ల భద్రత కోసం నిరంతర చర్యలు కొనసాగిస్తున్నాం. అయితే, డ్రైవర్లలో మానసిక మార్పు రావడం అత్యవసరం,’ అని అధికారులు చెప్పారు. రహదారి భద్రత నిపుణులు మాత్రం కేవలం పోలీసు చర్యలతో సమస్య పరిష్కారం కాదని చెబుతున్నారు. వారు స్పష్టమైన లేన్ మార్కింగ్‌లు, సరైన సిగ్నేజీలు, రహదారి డిజైన్ మెరుగులు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు అవసరమని సూచించారు. అలాగే.. నిర్లక్ష్యంగా నడిపే హెవీ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa