ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పడు మూగజీవాలకు రక్షణ కల్పించాల్సినవసరం ఉందని పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారు అన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానలు రూపొందించడానికి సచివాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. తర్వాత క్యాబినెట్లో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. యూనిసెఫ్ ఆధ్వర్యంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పడు మూగజీవాలకు రక్షణ కల్పించడంపై గురువారం జరిగిన సదస్సులో మంత్రి శ్రీహరిగారు మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలను పసిగట్టడంలో మనకంటే మూగజీవాలు ముందున్నప్పటికీ.. వాటికి కనీస రక్షణ ఏర్పాట్లు లేక ప్రమాదంలో పడుతున్నాయన్నారు. ఇలాంటి తరుణంలో వాటి రక్షణకు స్పష్టమైన విధానాలను రూపొందించాల్సినవసరం ఎంతైనా ఉందన్నారు. పక్రృతిని వికృతంగా వాడుకుంటున్నందున వైపరీత్యాలు సహజంగా మారాయని మంత్రి చెప్పారు. భారీ వర్షాలు, విపరీతమైన ఎండలకు మనమే తట్టుకోలేకపోతున్నాం.. అలాంటిది మూగ జీవాలు ఎలా అని ఆలోచించడం చాలా మంచి పరిణామం అని అన్నారు. రాష్ట్రంలో గోవుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామని.. తెలంగాణ గో సంరక్షణ్ పేరిట విధివిధానాలను రూపొందించామని గుర్తు చేశారు.
ప్రకృతివైపరీత్యాలు సంభవించినప్పుడు రిహాబిలిటేషన్ కేంద్రాలను ప్రజలను తరలించడం, వారికి రక్షణ కల్పించడం తరచూ జరుగుతోంది. మూగ జీవాల విషయంలోనూ ఆలోచన చేయాల్సినవసరం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అరవింద్కుమార్, హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పడు ఇప్పటివరకూ ప్రజల ప్రాణాలు, ఆస్తుల విషయంలోనే ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం జరిగిందన్నారు. మూగజీవాలకు కూడా షెల్టర్ జోన్లను ఏర్పాటు చేసి రక్షణ కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల ఒక్క రోజులోనే 10 సెంటీ మీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల మేర వర్షం పడుతోందని.. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. ఈ నేపథ్యంలో మూగ జీవాల గురించి ప్రత్యేక చర్యలవసరమన్నారు. వర్షాల గురించి ముందస్తు సమాచార వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామన్నారు. దీనిని మరింత అభివృద్ధి చేయాల్సినవసరం ఉందన్నారు. వరదలను అరికట్టడానికే చెరువుల పరిరక్షణ పెద్దయెత్తున జరుగుతోందదన్నారు. ఆ దిశగా హైడ్రా పని చేస్తోందని.. నగరంలో నాలాల విస్తరణతో ప్యాట్నీ, అమీర్పేట పరిసరాలు మునగకుండా జాగ్రత్త పడ్డామన్నారు. నాలాలు, చెరువులు ఆక్రమణలకు గురి కాకుండా వాటిని పరిరక్షిస్తే చాలా వరకు వరదలు నివారించవచ్చునని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. పశుసంవర్థక శాఖ డైరెక్టర్ శ్రీ బి. గోపి గారు, కేరళ రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం మెంబర్ సెక్రటరీ డా. సేఖర్ ఎల్ కురాయ్కోస్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa