వర్షం ఎంత పడినా హైడ్రా ఉందనే భరోసా నగర ప్రజలకు ఇచ్చారు. భారీ వర్షాలు పడినా వరదలు ముంచెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నిత్యం క్యాచ్పిట్లు, కల్వర్టులతో పాటు.. నాలాల్లో పూడిక తీసి వరద సాఫీగా సాగేలా చర్యలు తీసుకున్నారు అని మాన్సూన్ ఎమర్జన్సీ, డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు అభినందించారు. వర్షాకాలంలో పని చేసే మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్‌ల కాలపరిమితి 150 రోజులు పూర్తయిన సందర్భంగా శుక్రవారం జలవిహార్‌లో ఏర్పాటు చేసిన అభినందన సభలో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు మాట్లాడారు. 5 నెలల క్రితం ఇక్కడే సమావేశమై.. మాన్సూన్ విధుల గురించి వివరించాం. నిర్దేశించిన దానికంటే ఎక్కువ పని చేసి హైడ్రాతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చారు. వర్షాల వేళ ముప్పు ప్రాంతాల్లో సేవలందిస్తూ ప్రజల ప్రశంసలు అందుకున్నారు. సమస్య పరిష్కారం వరకే పరిమితం అవ్వకుండా.. ఆ సమస్యకు కారణాలను కూడా తెలుసుకుని పని చేసిన తీరు అభినందనీయమని హైడ్రా కమిషనర్ అన్నారు.
హైడ్రాలో భాగమైన డిజాస్టర్ రెస్పాన్స్ సిబ్బంది, ఎస్ ఎఫ్ వోలు, మార్షల్స్‌తో కలసి మెట్ టీమ్‌లు ఎంతో నిబద్ధతతో పని చేశాయని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు అభినందించారు. ఇలా 3 వేల లారీల పూడికను నాలాల నుంచి తొలగించి వరద సాఫీగా సాగేలా రేయింబవళ్లు పని చేసిన తీరు నగర ప్రజలు గమనించారన్నారు. వర్షాలు వస్తున్న వేళ.. వరద భయం లేకుండా నగర ప్రజలు ప్రయాణాలు సాఫీగా సాగించారు. కాలనీలు నీట మునగకుండా ముందస్తు జాగ్రత్తలో వరద ముప్పు లేకుండా చేశారంటూ హైడ్రా కమిషనర్ మెట్ టీమ్‌లను కొనియాడారు. వాతావరణ పరిస్థితుల వల్ల క్లౌడ్‌బరస్ట్‌లు చాలాసార్లు సంభవించాయి. ఒకే రోజు 10 నుంచి 18 సెంటీమీటర్లు వర్షం పడిన సందర్భాలు అనేకం ఈ వర్షాకాలం చవి చూశాం.. కాని మీరంతా మనసుపెట్టి పని చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో నిరూపించారు. అందుకే ఒక్క అభినందన సమావేశంలా కాకుండా.. వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలకు అన్ని విధాల ఎదిగేలా వ్యక్తిత్వ వికాసానికి కూడా హైడ్రా ప్రయత్నించిందన్నారు. ఈ క్రమంలోనే ఆర్థిక క్రమశిక్షణ, సరైన జీవన విధానాలను అలవర్చుకునే విధంగా వ్యక్తిత్వ వికాస తరగతులు కూడా నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా వ్యక్తిత్వ, ఆర్థిక వికాస నిపుణులు వంగా రాజేంద్రప్రసాద్, ఎం. నర్సింగ్, చిల్లంచెట్టి గణేష్‌లను హైడ్రా కమిషనర్ మెమొంటోలు అందజేసి సన్మానించారు.
మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్ (ఎంఈటీ)లలో ఉత్తమంగా పని చేసిన 30 మందికి ప్రశంసాపత్రం, బహుమతిని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్గారు అందజేశారు. అలాగే శాలువతో సన్మానించారు. నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు.. ఊళ్ల నుంచి వచ్చిన వారు ఈ వర్షాకాలం ఎంఈటీలో భాగస్వామ్యమై గొప్ప సేవలందించారని.. నిబద్ధతతో పని చేశారని కమిషనర్ కొనియాడారు. ఈ ఏడాది ఎంతో అనుభవం గడించాం. వచ్చే ఏడాది మరింత సమర్థవంతంగా వర్షాకాలం పని చేసేందుకు ఈ అనుభవం ఎంతో దోహదం చేస్తోంది. భారీ వర్షాలు పడితే ఏ ప్రాంతాలు నీట మునుగుతాయి.. ఇందుకు గల కారణాలు ఏంటి ఇలా అన్నిటిపైనా మెట్ టీమ్‌లతో పాటు.. డీఆర్ ఎఫ్, ఎస్ ఎఫ్‌వోలకు స్పష్టమైన అవగాహన మొదటి ఏడాది వచ్చిందన్నారు. ఈ క్రమంలోనే అమీర్‌పేటలో నాలాలను పూడిక తీసి వరద ముప్పు తప్పించాం. అలాగే ప్యాట్నీ నాలా ఆక్రమణలను తొలగించి 25 కాలనీలు, బస్తీలకు వరద ముప్పు లేకుండా చేశామని హైడ్రా కమిషనర్ చెప్పారు. ఇలా ఎన్నో విజయాలు సాధించామన్నారు. ఈ వర్షాకాలంలో హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు, ఎస్ ఎఫ్‌వోలు పని చేసిన తీరును హైడ్రా అడిషనల్ డైరెక్టర్ శ్రీ వర్ల పాపయ్యగారు వివరించారు. పొదుపు ఆవశ్యకతతో పాటు.. ఆరోగ్య పరిరక్షణ గురించి హైడ్రా అడ్మిన్ ఎస్పీ శ్రీ ఆర్. సుదర్శన్‌గారు పలు సూచనలు చేశారు. ముఖ్యమైన పండగలున్నా సెలవులు పెట్టకుండా.. వర్షాకాలంలో పని చేశారని కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa