సోమవారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ప్రతిష్ఠాత్మక ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు హైదరాబాద్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగే ఈ సదస్సు కోసం దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు తరలివస్తుండటంతో నగరం ఆధునిక హంగులను సంతరించుకుంది. ఈ కీలక తరుణంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హృదయపూర్వక సందేశాన్ని అందించారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని వివరిస్తూ, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టతనిచ్చారు.“జాతి కోసం జనహితం కోసం గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలి గొప్ప కార్యాలు చేయాలంటే మహా సంకల్పం కావాలి” అంటూ తన సందేశాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, గత రెండేళ్లుగా అహర్నిశలు శ్రమించి తెలంగాణను ప్రగతి శిఖరాలపై నిలబెట్టేందుకు తపించానని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో శిథిలమైన వ్యవస్థలను సరిదిద్ది, నిరుద్యోగ యువతకు కొలువుల జాతరతో కొత్త భరోసా కల్పించామని తెలిపారు. రుణభారంతో కుంగిపోయిన రైతులకు అండగా నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిచామని గుర్తుచేశారు. ఆడబిడ్డల ఆకాంక్షలకు ఆర్థికంగా చేయూతనివ్వడంతో పాటు, కేవలం కొద్దిమందికే పరిమితమైన వ్యాపార రంగాన్ని బలోపేతం చేశామని వివరించారు.సామాజిక న్యాయం తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేస్తూ, బలహీన వర్గాల వందేళ్ల ఆకాంక్ష అయిన కులగణన చేపట్టామని, మాదిగ సోదరుల దశాబ్దాల ఉద్యమానికి ఎస్సీ వర్గీకరణ ద్వారా న్యాయం చేశామని తెలిపారు. విద్యను బతుకుదెరువుకు బ్రహ్మాస్త్రంగా భావించి, ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల’ నిర్మాణానికి పునాదులు వేశామని, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీలకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం అనే మూల సిద్ధాంతాలతో ముందుకు సాగుతూ, ప్రజాకవి అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతానికి రాష్ట్ర అధికారిక గీతంగా గుర్తింపునిచ్చామని చెప్పారు.ఈ రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, సన్నధాన్యాలకు రూ.500 బోనస్, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా మార్చే పథకాలు తమ పాలనకు నిదర్శనాలని అన్నారు. కేవలం నేటి అవసరాలు తీర్చడమే కాకుండా, 2047 నాటికి స్వతంత్ర భారతావని వందేళ్ల మైలురాయికి చేరేనాటికి తెలంగాణ ఎలా ఉండాలనే దానిపై లోతైన అధ్యయనంతో ఒక మార్గదర్శక పత్రాన్ని సిద్ధం చేశామని వెల్లడించారు. “గత పాలకులు కలలో కూడా ఊహించని విజన్‌కు ప్రాణం పోసి, ప్రణాళికలతో ప్రపంచ వేదికపై రీసౌండ్ చేయడానికి సిద్ధమయ్యాం. నిన్నటి వరకు ఒక లెక్క రేపటి గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క” అని సీఎం తన పోస్ట్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజలు ఇచ్చిన ఓటు, వారి ఆశీర్వాదాలే తనకు ధైర్యాన్ని, సంకల్పాన్ని ఇచ్చాయని, వారి ప్రేమాభిమానాలే తనకు సర్వస్వమని తెలిపారు. “తెలంగాణ నాకు తోడుగా ఉన్నంత వరకు ఈ గొంతులో ఊపిరి ఉన్నంత వరకు... ’కు తిరుగు లేదు” అని తన సందేశాన్ని ముగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa