శీతాకాల ప్రయాణాలు, ఇండిగో విమాన సర్వీసుల రద్దు కారణంగా పెరిగిన ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు భారతీయ రైల్వే కీలక చర్యలు చేపట్టింది. రాబోయే మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా 89 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు వివిధ రైల్వే జోన్ల పరిధిలో 100కు పైగా ట్రిప్పులు నడపనుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రయాణాలను సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.రద్దీని దృష్టిలో ఉంచుకొని సెంట్రల్ రైల్వే 14, వెస్ట్రన్ రైల్వే 7 ప్రత్యేక సర్వీసులను ప్రకటించాయి. అలాగే సౌత్ ఈస్టర్న్ రైల్వే, ఈస్టర్న్ రైల్వే, నార్తర్న్ రైల్వే పరిధిలో కూడా పలు ప్రధాన నగరాల మధ్య అదనపు రైళ్లను నడుపుతున్నారు. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, కోల్కతా, లక్నో, పూణె, పాట్నా వంటి రద్దీ మార్గాల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.దక్షిణ మధ్య రైల్వే కూడా శనివారం నుంచి మూడు ప్రత్యేక రైళ్లను ప్రారంభించింది. వీటిలో చర్లపల్లి - షాలిమార్, సికింద్రాబాద్ - చెన్నై ఎగ్మోర్, హైదరాబాద్ - ముంబై ఎల్టీటీ సర్వీసులు ఉన్నాయి. ఈ ప్రత్యేక రైళ్ల ఏర్పాటుతో సాధారణ రైళ్లపై భారం తగ్గడంతో పాటు ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ వెసులుబాటు లభిస్తుందని రైల్వే శాఖ భావిస్తోంది. వివిధ మార్గాల్లో ప్రకటించిన ఈ అదనపు సర్వీసులు ప్రయాణికులకు భారీ ఊరటనిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa