ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూతురితో గొడవపడి మేనత్త ఇంటికి వెళ్లిన అల్లుడు.. ఆ అత్త మరీ ఇంతకు తెగిస్తుందనుకోలేదు!

Crime |  Suryaa Desk  | Published : Mon, Dec 08, 2025, 09:22 PM

నేటి సమాజంలో మానవ సంబంధాలు నానాటికీ దిగజారిపోతున్నాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనన్న ఓ పెద్దమనిషి మాటను నిజం చేస్తూ.. బంధాలు, బంధుత్వాలు మరిచి పగలు, ప్రతీకారాలు రాజ్యమేలుతున్నాయి. భార్యపై భర్త, భర్తపై భార్య, కొడుకుపై తండ్రి, తండ్రిపై కొడుకు ఇలా మానవ సంబంధాలను, పేగు బంధాలను మరిచి ఒకరిపైఒకరు దాడులు పాల్పడుతున్నారు. హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నారు. అలాంటి ఘటనే అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. కూతురి కాపురం పదికాలాల పాటు చల్లగా ఉండాలని దీవించాల్సిన కన్న తల్లే.. అల్లుడిపై దాడి చేయించింది. అల్లుడి రక్తం కళ్ల జూసింది. ప్రేమలు, ఆప్యాయతలు మరిచి.. అత్యంత దారుణంగా కిరాయి గూండాలతో అల్లుడి ప్రాణాలు తీయించేందుకు ప్రయత్నించింది.


ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లాలోని పెనగలూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. నెల్లూరుకు చెందిన పెంచలమ్మ.. తన కుమార్తెను రాపూరుకు చెందిన మునుస్వామి అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసింది. అయితే మునుస్వామికి అతని భార్యకు ఈ మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నాలుగు రోజుల కిందట కూడా ఓసారి మునుస్వామికి అతని భార్యకు గొడవ జరిగింది. దీంతో మునుస్వామి ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. పెనగలూరులోని మేనత్త ఇంటికి వెళ్లాడు. అయితే తరుచూ కూతురితో గొడవపడుతూ ఆమెను ఇబ్బంది పెడుతున్న అల్లుడిపై కోపం పెంచుకున్న పెంచలమ్మ.. అతని అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఇందుకోసం కిరాయి వ్యక్తులను మాట్లాడుకుంది.


పెంచలమ్మతో ఒప్పందం చేసుకున్న కిరాయి వ్యక్తులు సోమవారం పెనగలూరులోని మునుస్వామి ఉంటున్న ప్రాంతానికి వచ్చారు. రెండు బైకులపై అక్కడకు చేరుకున్న కిరాయి వ్యక్తులు.. మునుస్వామిపై కత్తులతో దాడి చేశారు. ఈ క్రమంలోనే మునుస్వామి గొంతుపై దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. బాధతో పెద్దగా కేకలు వేశాడు. అతడి కేకలతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. దీంతో స్థానికులను చూసిన దుండగులు అక్కడి నుంచి ఉడాయించారు. అనంతరం గాయపడిన మునుస్వామిని స్థానికులు రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స జరుగుతోంది.


మరోవైపు మునుస్వామిపై దాడి చేసిన కత్తిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అయితే కూతురితో గొడవలు పడుతున్నాడని అల్లుడిపై అత్త దాడి చేయించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. గొడవలు ఉన్నప్పుడు కూర్చుని మాట్లాడుకోవాల్సింది పోయి.. ఇలా దాడులు చేయించడం ఏమిటని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తు్న్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa