తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల పూర్తి టైమ్ టేబుల్‌ను విద్యాశాఖ మంగళవారం (డిసెంబర్ 9) విడుదల చేసింది. తాజా అధికారిక షెడ్యూల్ ప్రకారం.. ఈ కీలక పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్ 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు (ఫిబ్రవరి 25 నుంచి మార్చి 13 వరకు) ముగిసిన వెంటనే టెన్త్ పరీక్షలు మొదలవుతాయి.
పరీక్షల మధ్య భారీ విరామం..
ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో విద్యాశాఖ తీసుకున్న అత్యంత ముఖ్యమైన నిర్ణయం.. ప్రతి పరీక్షకు మధ్య గ్యాప్ ఇవ్వడం. పండుగల సమయాలు, సెలవు దినాలు ఈ పరీక్షల మధ్య రావడం వలన విద్యార్థులకు నాలుగు రోజుల వరకు గ్యాప్ లభించింది.
సాధారణంగా పరీక్షల సమయంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. ఈ సుదీర్ఘ విరామం కారణంగా విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఒక్కో సబ్జెక్టుపై దృష్టి సారించడానికి .. రివిజన్ చేసుకోవడానికి సమయం దొరుకుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం విద్యార్థుల ఉత్తమ ఫలితాలకు దోహదపడుతుందని విద్యాశాఖ నమ్ముతోంది.
అన్ని ప్రధాన సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించబడతాయి. సైన్స్ సబ్జెక్టుకు సంబంధించి పరీక్ష విధానంలో స్పష్టత ఇచ్చారు. ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలు రెండు భాగాలుగా.. వేర్వేరు రోజుల్లో జరగనున్నాయన్నారు. ఫిజికల్ సైన్స్.. ఏప్రిల్ 2, 2026 , బయోలాజికల్ సైన్స్ ఏప్రిల్ 7, 2026న నిర్వహించనున్నారు. ఈ రెండు సైన్స్ పేపర్లు ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు మాత్రమే నిర్వహించనున్నారు.
పరీక్ష తేదీ, సబ్జెక్టు వివరాలిలా ఉన్నాయి. మార్చి 14, 2026 ఫస్ట్ లాంగ్వేజ్ (First Language), మార్చి 18, 2026 సెకండ్ లాంగ్వేజ్ (Second Language), మార్చి 23, 2026 థర్డ్ లాంగ్వేజ్ (Third Language), మార్చి 28, 2026 మ్యాథమాటిక్స్ (Mathematics), ఏప్రిల్ 02, 2026 ఫిజికల్ సైన్స్ (Physical Science), ఏప్రిల్ 07, 2026 బయోలాజికల్ సైన్స్ (Biological Science), ఏప్రిల్ 13, 2026 సోషల్ స్టడీస్ (Social Studies). పరీక్షల షెడ్యూల్‌కు ప్రభుత్వ ఆమోదం లభించడంతో.. విద్యాశాఖ వెంటనే అన్ని జిల్లాల జిల్లా విద్యాధికారులకు (DEOs), పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమాచారం పంపింది. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాల మేరకు.. జిల్లా విద్యా అధికారులు జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు లేకుండా పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa