ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాతబస్తీలో 7 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 19, 2025, 04:03 PM

పాత బస్తీలో గ‌జం ఖాళీ జాగా లేకుండా ల‌క్ష‌లాది నివాసాలున్న చోట‌.. ఏకంగా 7 ఎక‌రాల‌ను ఓ ప్ర‌బుద్ధుడు క‌బ్జా చేస్తే.. ఆ భూమిని హైడ్రా శుక్ర‌వారం కాపాడింది. పోలీసు స్టేష‌న్లో కేసుల‌కు వెర‌వ‌కుండా.. కోర్టు ఫైన్లు కూడా ప‌ట్టించుకోకుండా.. చుట్టూ ఇనుప రేకుల‌తో లోప‌ల ఏం జ‌రుగుతుందో తెలియ‌కుండా ప్ర‌హ‌రీ నిర్మించి.. ఆక్ర‌మ‌ణ‌లో ఉన్నవారిని హైడ్రా ఖాళీ చేయించింది. రెవెన్యూ అధికారుల స‌మ‌క్షంలో.. పోలీసు బందోబ‌స్తు మ‌ధ్య ఇనుప రేకుల ప్ర‌హ‌రీని తొల‌గించి.. అక్క‌డ హైడ్రా ఫెన్సింగ్  ఏర్పాటు చేసింది.  ప్ర‌భుత్వ భూమిగా వివరాలు పేర్కొంటూ హైడ్రా బోర్డులు పెట్టింది.  దీంతో అక్క‌డి స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. జ‌నాభా ఎక్కువ‌గా ఉన్న పాత‌బ‌స్తీలో గ‌జం జాగా దొర‌క‌ని ప్రాంతంలో ఏకంగా 7 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి ఉండ‌డం ప‌ట్ల స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. హైడ్రా శుక్ర‌వారం కాపాడిన 7 ఎక‌రాల భూమి విలువ దాదాపు రూ. 400 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేశారు. క‌బ్జాదారులు మాయం చేసిన చెరువుతో పాటు.. నాలాల‌ను పున‌రుద్ధ‌రిస్తే బ‌మృక్‌నుద్దౌలా మాదిరి ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంద‌ని చెబుతున్నారు.


హైదరాబాద్ జిల్లా బండ్లగూడ మండలం కందికల్ విలేజ్‌లోని మొహమ్మద్‌నగర్ – లాలితాబాగ్ ప్రాంతం, రైల్వే ట్రాక్ సమీపంలో టౌన్ సర్వే నంబర్ 28, బ్లాక్:ఎఫ్, వార్డు నంబర్ 274లో మొత్తం 9.11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇప్పటికే 2 ఎకరాలు కబ్జా అయి.. నివాసాలు వచ్చేశాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా కబ్జాలో ఉన్న 7 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది.  సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ప్రకారం అక్క‌డ చెరువు ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. కాని ఆ చెరువు ఆన‌వాళ్లు ఎక్క‌డా లేకుండా మ‌ట్టితో క‌బ్జాదారులు క‌ప్పేశారు. ఈ  భూమిని కబ్జా చేసి తనదంటూ ఆర్. వెంకటేష్ కుటుంబ సభ్యులు మరియు ఇతరులు పోరాడుతున్నారు. వీరి పై భవానిపురం పోలీసు స్టేష‌న్‌లో రెవెన్యూ అధికారులు కేసులు కూడా పెట్టారు.  ఇప్పుడు ఆయ‌న వార‌సులు ఒక ప‌క్క‌న ఈ భూమి త‌మ‌దంటూ చెబుతుండ‌గా.. వారి వ‌ద్ద నుంచి ప‌ట్టాభి రామి రెడ్డి కొన్నానంటూ మ‌రోవైపు క‌బ్జాలో భాగ‌స్వామ్యం అయ్యాడు. ఈ మేర‌కు కోర్టులో కేసు కూడా వేశాడు.  అయితే ప్ర‌భుత్వ భూమిని ఏ ప్రాతిప‌దిక‌న త‌న‌దిగా చెప్పుకుంటార‌ని.. కోర్టు స‌మ‌యం వృథా చేసినందుకు కోటి రూపాయ‌లు ఫైన్ కూడా వేసింది.  అయినా క‌బ్జాదారులు ఖాళీ చేయ‌కుండా  కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు.  


మొహమ్మద్‌నగర్ – లాలితాబాగ్ ప్రాంతంలో, రైల్వే ట్రాక్ సమీపంలో ప్రభుత్వ భూమితో పాటు నాలా, కుంట ను క‌బ్జా దారుల చెర‌ నుంచి విముక్తి క‌ల్పించిన హైడ్రాకు స్థానికులు ధ‌న్య‌వాదాలు తెలిపారు.  హైడ్రాకు ఫిర్యాదు చేయ‌గానే.. స్థానికంగా విచారించి.. వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవ‌డాన్ని కుమ్మరి వాడి పీస్ వెల్ఫేర్ సొసైటీ ప్ర‌తినిధులు ఆనందం వ్య‌క్తం చేశారు. రెండు కమ్యూనిటీల మధ్య ఉన్న సున్నితమైన ప్రాంతంలో క‌బ్జాల‌కు పాల్ప‌డిన వారు ప్లాట్లుగా మార్చి అమ్మేందుకు ప్ర‌య‌త్నించ‌డం వివాదంగా మారింది. వీరి వెనుక బ‌డాబాబుబులున్నారంటూ ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. ఈ అక్రమ ఆక్రమణలపై గతంలోనే బండ్లగూడ తహసీల్దార్, పోలీసు శాఖలకు పలుమార్లు ఫిర్యాదు చేయ‌డం.. కోర్టులు కూడా ప్రభుత్వ భూమి అని స్పష్టంగా తీర్పులు ఇచ్చినప్పటికీ కబ్జాదారులు ఖాళీ చేయ‌కుండా ప్లాట్లు చేసి అమ్ముకోవాల‌ని ప్ర‌య‌త్నించ‌డం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. అటువైపు ఎవ‌రూ వెళ్ల‌డానికి వీలు లేకుండా చేశారంటూ వాపోయారు.  హైడ్రా కమిషనర్ శ్రీ ఏ.వి. రంగనాథ్ ఐపీఎస్ గారికి అభినంద‌న‌లు తెలిపారు. ఆక్రమణదారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని.. అక్క‌డ నాలాతో పాటు.. చెరువును పున‌రుద్ధ‌రిస్తే పాత‌బ‌స్తీలో చాలా ప్రాంతాల‌కు వ‌ర‌ద ముప్పు త‌ప్పుతుంద‌ని స్థానికులు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa