ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 02, 2026, 07:28 PM

ఖమ్మం జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఒక పాఠశాల బస్సు ప్రమాదానికి గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వేంసూరు మండలం మొద్దులుగూడెం గ్రామానికి చెందిన శ్రీ వివేకానంద విద్యాలయం స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. గణేష్‌పాడు, సోబ్బాయిగూడెం గ్రామాల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో..రోడ్డు పక్కనే ఉన్న పంట కాలవలోకి బస్సు ఒరిగిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 106 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.


బస్సు ఒక్కసారిగా కాలవలోకి ఒరిగిపోవడంతో విద్యార్థులు భయాందోళనతో కేకలు వేశారు. ఈ ప్రమాదంలో సుమారు 40 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను బస్సు నుండి బయటకు తీశారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని చికిత్స కోసం వేంసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం కలగకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని బస్సులో ఉన్న విద్యార్థులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం వల్లే బస్సుపై నియంత్రణ కోల్పోయారని వారు చెబుతున్నారు. స్కూల్ బస్సుల భద్రతపై కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ.. ఇలాంటి ఘటనలు జరగడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు ఫిట్‌నెస్, డ్రైవర్ లైసెన్స్ వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. విద్యార్థుల భద్రతను విస్మరించిన పాఠశాల యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


పాఠశాల వాహనాలకు ప్రతి ఏడాది ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోవడం, డ్రైవర్లకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించడం వంటివి రవాణా శాఖ పర్యవేక్షించాల్సి ఉంటుంది. విద్యార్థుల భద్రత కోసం బస్సుల్లో జిపిఎస్ ట్రాకింగ్ , సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. విద్యాసంస్థలు కేవలం లాభార్జనే కాకుండా.. విద్యార్థుల సురక్షిత ప్రయాణానికి బాధ్యత వహించాలని విద్యాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa