సాధారణంగా తోటల్లోకి పక్షులు, జంతువులు రాకుండా రైతులు కాపలా కాస్తారు. కానీ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన రైతు ఆనంద్ మాత్రం 'మందుబాబుల' బారి నుంచి తన మామిడి తోటను కాపాడుకోవడానికి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన తోటను మద్యం తాగే స్థావరంగా మార్చుకున్న వారిని హెచ్చరిస్తూ ఆయన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆనంద్కు నర్సాపూర్ ప్రధాన రహదారి పక్కనే మామిడి తోట ఉంది. నర్సాపూర్ పట్టణంలో మద్యం కొనుగోలు చేసే కొందరు వ్యక్తులు, దారి పక్కనే ఉన్న ఈ తోటను తమ 'బార్'గా మార్చుకున్నారు. చెట్ల నీడన కూర్చుని హాయిగా మద్యం సేవించడమే కాకుండా, వెళ్లేటప్పుడు ఖాళీ సీసాలను తోటలోనే పగలగొట్టి వెళ్తున్నారు. అలాగే తిన్న పదార్థాల వ్యర్థాలను డిస్పోజబుల్ ప్లేట్లు, గ్లాసులు తోట నిండా పడేసి అపరిశుభ్రం చేస్తున్నారు.
మందుబాబులు పగలగొట్టిన గాజు ముక్కల వల్ల తోటలో పనిచేసే కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిందెలు చూడటానికి, నీళ్లు పెట్టడానికి వెళ్లే కూలీల కాళ్లకు ఈ సీసా పెంకులు గుచ్చుకుని పలుమార్లు రక్తగాయాలయ్యాయి. ఎన్నిసార్లు చెప్పినా, బతిమిలాడినా మందుబాబుల ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆనంద్ విసిగిపోయారు. శాంతితో చెప్పినప్పుడు వినని వారికి 'సామ దాన భేద దండోపాయాలు' వాడాలని నిర్ణయించుకున్న ఆనంద్.. తన తోట చుట్టూ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అందులో ఆయన రాసిన మాటలు చూసి మందుబాబుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
'ఇక్కడ మామిడి చెట్లలో మద్యం తాగరాదు. తాగినచో వారికి 25 చెప్పుదెబ్బలు.. అలాగే రూ. 5,000 జరిమానా విధించబడును' అని ఆ బ్యానర్లో స్పష్టంగా హెచ్చరించారు. ఈ వినూత్న హెచ్చరికను చూసిన స్థానికులు దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. నెటిజన్లు ఈ రైతు ధైర్యాన్ని అభినందిస్తున్నారు. అన్నదాత ఆవేదనను అర్థం చేసుకోవాలి.. తోటలు పార్టీలకు వేదికలు కావు అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ ఘాటు హెచ్చరిక తర్వాతైనా మందుబాబులు తమ పద్ధతి మార్చుకుంటారో లేదో వేచి చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa