ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై సుప్రీంకోర్టు ఆదేశాలు,,,,4 వారాల్లో ప్రక్రియ పూర్తి చేయండి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 05, 2026, 07:03 PM

తెలంగాణ పోలీస్ బాస్‌గా శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకాన్ని తెలంగాణ హైకోర్టు సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది. డీజీపీ నియామకాన్ని సస్పెండ్ చేయాలని పిటిషన్‌ దాఖలు చేయగా.. దానిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా వాదనలు విని.. విచారణను ముగించింది.


ఈ క్రమంలోనే పూర్తిస్థాయి డీజీపీ నియామక ప్రక్రియను 4 వారాల్లో పూర్తి చేయాలని యూపీఎస్సీతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ డీజీపీ నియామక ప్రక్రియను యూపీఎస్సీ, తెలంగాణ సర్కార్ కలిసి సమన్వయంతో నిర్వహించాలని స్పష్టంగా ఆదేశించింది. ఈ విషయంలో హైకోర్టు తీర్పును సుప్రీం న్యాయస్థానం సవరించింది. గత ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని యూపీఎస్సీ సహా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.


4 వారాల్లో డీజీపీ నియామకంపై యూపీఎస్సీ.. తగిన సిఫారసులు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అధికారుల యోగ్యత ఆధారంగా ఈ సిఫారసులు ఉండాలని స్పష్టం చేసింది. ప్రతిపాదిత డీజీపీల పేర్లను యూపీఎస్సీకి సరైన సమయానికి పంపించడంలో తెలంగాణ సహా దేశంలోని చాలా రాష్ట్రాలు ఆలస్యం చేస్తున్నాయని తేల్చి చెప్పింది. ఇలా రాష్ట్రాలు చేస్తున్న ఆలస్యం కారణంగా మెరిట్ ఉన్న అధికారులకు అన్యాయం జరుగుతోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.


తాత్కాలిక డీజీపీలను నియమించే పేరుతో రెగ్యులర్ డీజీపీని రాష్ట్రాలు నియమించడం లేదని.. రాష్ట్రాలు ప్రతిపాదనలు ఆలస్యం చేస్తే త్వరగా ప్రతిపాదనలు పంపాలని అన్ని రాష్ట్రాలకు యూపీఎస్సీ లేఖలు రాయాలని హితవు పలికింది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలు సకాలంలో పంపించకపోతే యూపీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. డీజీపీల నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించకపోతే తగిన పరిణామాలు ఎదుర్కొక తప్పదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa